
ఐస్ క్రీమ్ ఇష్టపడనివారు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రోడ్ సైడ్ అమ్మే లోకల్ బ్రాండ్స్ దగ్గర నుంచి నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వరకు ఏ బ్రాండ్ మార్కెట్ ఆ బ్రాండ్ కి ఉంటుంది. అయితే.. ఐస్ క్రీమ్ పట్ల జనాలకు ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు కొంతమంది కక్కుర్తి పడుతున్నారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన సింథటిక్ కలర్స్ మోతాదుకు మించి వాడుతూ.. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ లో ఓ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ బాగోతం బయటపడింది. బుధవారం ( సెప్టెంబర్ 17 ) మల్కాజ్ గిరి ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ డొల్లతనం బయటపడింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
రామంతాపూర్ లోని శారద నగర్ లో ఉన్న శివసాగర్ ఫలూడ ఐస్ క్రీం ఫ్యాక్టరీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అధికారులు. ఈ తనిఖీల్లో మోతాదుకు మించి సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు అధికారులు.ఈ క్రమంలో ఐస్ క్రీం ఫ్యాక్టరీ నిర్వాహకుడు దేవీలాల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ రకాల సింథటిక్ కలర్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న సింథటిక్ ఫుడ్ కలర్స్ ను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు మల్కాజ్ గిరి ఎస్ఓటీ పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఉప్పల్ పోలీసులు. ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగించే సింథటిక్ కలర్స్ వంటి పదార్థాలు మోతాదుకు మించి వాడితే సహించమని.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు.