
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై తమిళనాడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తమిళనాడు వస్తే 'చెంపదెబ్బ కొట్టాలి' అంటూ పిలుపునిచ్చేలా మాట్లాడటం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళా కార్యకర్తలపై కంగనా గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అళగిరి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎప్పుడూ అహంకారపూరిత వైఖరిలో ఉంటుందంటూ విమర్శలు గుప్పించారు.
లేటెస్ట్ గా ఓ ఇంటర్యూలో కేఎస్ అళగిరిని విలేకరి కంగనా రనౌత్ గురించి ప్రశ్నించగా ఈ వివాస్పధ వ్యాఖ్యలు చేశారు. గతంలో కంగనా రనౌత్ మహిళా కార్యకర్తలను ఉద్దేశించి.. కేవలం రూ. 100 ఇస్తే నిరసనల్లో పాల్గొంటారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను అళగిరి తీవ్రంగా ఖండించారు. కంగనా చాలాసార్లు అహంకారంతో మాట్లాడతారని మండిపడ్డారు.
ఒకసారి ఢిల్లీ విమానాశ్రయంలో ఒక మహిళా సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆమెను చెంపదెబ్బ కొట్టింది. ఆమె అప్పుడు తాను అగౌరవంగా మాట్లాడటం వల్లే అలా జరిగిందని చెప్పింది. ఇప్పుడు ఆమె ఈ వైపు తమిళనాడు వస్తే, ఆమెను మర్చిపోకుండా చెంపదెబ్బ కొట్టాలి అని అళగిరి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే లేపాయి.
కంగనా వివాదాలు..
2021లో జరిగిన రైతుల నిరసనల సందర్భంగా 73 ఏళ్ల మహిళా రైతు కార్యకర్త మొహిందర్ కౌర్‌ను ఉద్దేశించి కంగనా ఒక ట్వీట్ చేసింది. తన ఎక్స్ పోస్ట్‌లో, ఆమె మొహిందర్ కౌర్‌ను షాహీన్ బాగ్ నిరసనల్లో పాల్గొన్న బిల్కిస్ బానో అని అభివర్ణిస్తూ.. ఇలాంటి మహిళలకు రూ. 100 చెల్లించి నిరసనల్లో పాల్గొనేలా చేయవచ్చని సూచించింది. ఇది ఆమెపై పరువునష్టం ఆరోపణలకు దారితీసింది. ఈ క్రమంలో మహీందర్ కౌర్ ఫిర్యాదు మేరకు కంగనాపై కేసు నమోదైంది
ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు "మీరు కేవలం రీట్వీట్ మాత్రమే చేయలేదు, దానికి మసాలా కూడా జోడించారు" అని కంగనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కోర్టు కూడా మొట్టికాయలు వేయడంతో .. మహిందర్ కౌర్ పై చేసిన వ్యాఖ్యల కేసును రద్దు చేయాలని ఆమె వేసిన పిటిషను ను ఉపసంహరించుకున్నారు.
ఇక రెండవది, గతేడాది చండీగఢ్ విమానాశ్రయంలో జరిగిన ఘటన. సెక్యూరిటీ చెక్ సమయంలో కుల్విందర్ కౌర్ అనే సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కంగనాను చెంపదెబ్బ కొట్టి, దుర్భాషలాడింది. రైతుల ఉద్యమంపై కంగనా వైఖరితో ఆమె ఆగ్రహం చెంది ఈ పని చేసిందని నివేదికలు తెలిపాయి. ఈ ఘటన తర్వాత కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయడంతో పాటు ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.
ఇప్పుడు కేఎస్ అళగిరి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక పక్క అళగిరి వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యలు సరికాదని ఖండిస్తున్నారు. ఈ సంఘటన మహిళలపై హింసను ప్రోత్సహించే విధంగా ఉందని పలువురు మహిళా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కంగనా రనౌత్ , బీజేపీ నాయకులు ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.