హైదరాబాద్ లో నీట మునిగిన ప్రాంతాలు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్..

హైదరాబాద్ లో నీట మునిగిన ప్రాంతాలు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్..

హైదరాబాద్ లో వర్షం వస్తే.. అమీర్ పేట, మాదాపూర్ సహా చాలా ఏరియాల్లో రోడ్లపై నీళ్లు నిలిచి ట్రాఫిక్ జామ్ తో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. వర్షం వచ్చిన ప్రతిసారి ఆయా ఏరియాల్లో రోడ్లు చెరువులను తలపిస్తుంటాయి. బుధవారం ( సెప్టెంబర్ 17) కురిసిన వర్షానికి నగరవాసులు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సమస్యకు చెక్ చెప్పేందుకు రంగంలోకి దిగింది హైడ్రా. బుధవారం కురిసిన వర్షానికి నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అమీర్ పేట గాయత్రీ నగర్ కాలనీ, మాదాపూర్ అమర్ సొసైటీ, బాగ్ లింగంపల్లి శ్రీరామ్ నగర్ లో పర్యటించారు రంగనాథ్. 

ఈ క్రమంలో కాలువల పూడిక త్వరగా తొలగించాలని అధికారులకు సూచించారు కమిషనర్ రంగనాథ్. అమీర్‌ పేట దగ్గర కాలువల్లో పూడిక తొలగించడంతో వరద సాఫీగా సాగుతోందని అన్నారు రంగనాథ్.ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద నీటితో గాయత్రి నగర్ మునుగుతోందని నివాసితుల ఫిర్యాదు చేయగా.. కాలువల్లో సిల్ట్ తొలగించి వరద ముప్పు నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కమిషనర్.

చెరువు నీటి మట్టం పెరగడంతో అమర్ సొసైటీ సహా అనేక కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరుతోందని.. నీటి మట్టం తగ్గించేందుకు ఇరిగేషన్, GHMC అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు కమిషనర్.క్లౌడ్ బరస్ట్ వల్ల గంటలోనే 15 సెంటీమీటర్ల వర్షం వస్తుందని, ఇలాంటి పరిస్థితులను తట్టుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు కమిషనర్. 

బాగ్‌ లింగంపల్లి శ్రీరాం నగర్‌ లో వర్షపు నీటి సమస్యకు వెంటనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు రంగనాథ్. శ్రీరామ్ నగర్ కి వచ్చే వరద నీళ్లు హుస్సేన్ సాగర్ వదర కాలువలో కలిసేలా ప్రత్యేక నాలా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.రెండు రోజుల్లో సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు రంగనాథ్.

పాత నాలా మూసివేయడం, ప్రభుత్వ స్థలంపై అక్రమ కబ్జాలు ఉన్నాయని ఫిర్యాదు చేసిన స్థానికులు.. నాలాను పునరుద్ధరిస్తే వెంటనే సమస్య సద్దుమణుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.వందలాది ఇళ్లకు దారి లేకుండా పోయిందని, నడుం లోతు నీటిలో ఇళ్లకు వెళ్లడం కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు.