పార్టీ మార్పు.. కొత్త పార్టీ ఏర్పాటుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

పార్టీ మార్పు.. కొత్త పార్టీ ఏర్పాటుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

నల్లగొండ: పార్టీ మార్పు, కొత్త పార్టీ ఏర్పాటు వార్తలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నేనేదో కొత్త పార్టీ పెడుతున్నట్టు, పదవికి రాజీనామా చేస్తున్నట్లు పుకార్లు పుట్టిస్తున్నారని.. నేనంటే గిట్టని వ్యక్తులు కొందరు సోషల్ మీడియాలో నా ఇమేజ్ తగ్గించే విధంగా ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారని అన్నారు. నాకు ఏదో మంత్రి పదవి రాకపోవడం వల్ల ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి  వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

గుంటూరులో ఒక ప్రైవేట్ ప్రోగ్రాంకు వెళ్తుంటే అక్కడ ఏదో జగన్‎ను కలుస్తానని.. ఇంకా ఏదేదో ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మొదటిసారి అసెంబ్లీలో ప్రశ్నించిన వ్యక్తిని నేనేనని.. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్‎ను నేను సమర్థిస్తున్నట్టు ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు.

 ఇప్పటి వరకు ఇలా చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేశానే తప్ప.. ప్రభుత్వానికి, పార్టీకి ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచే గెలుపొందానని.. కోమటిరెడ్డి ఫ్యామిలీ అంటేనే కాంగ్రెస్ అని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు లేదా కొత్త పార్టీ పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మెద్దని విజ్ఞప్తి చేశారు.