మార్చి 2 నుంచి 5 వరకు ఇండియా-నేపాల్ బోర్డర్ బంద్.. ఎందుకంటే..?

మార్చి 2 నుంచి 5 వరకు ఇండియా-నేపాల్ బోర్డర్ బంద్.. ఎందుకంటే..?

ఖాట్మాండ్: భారత పొరుగు దేశం నేపాల్‌లో 2026, మార్చి 5న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 2వ తేదీ అర్ధరాత్రి నుంచి 5వ తేదీ అర్ధరాత్రి వరకు భారత్-నేపాల్ బోర్డర్ క్లోజ్ కానుంది. బహ్రైచ్‌లోని రుపైదిహా దగ్గర ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ICP) ఇన్‌ఛార్జ్ సుధీర్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. నేపాల్ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా భారత్ నేపాల్ బోర్డర్‎ను నాలుగు రోజుల పాటు మూసివేయాలని నేపాల్ హోం మంత్రిత్వ శాఖ ఆదేశించిందని తెలిపారు. 

నేపాల్‌లోని బాంకే జిల్లాకు ఆనుకుని ఉన్న అన్ని సరిహద్దు అవుట్‌పోస్టులు మార్చి 2 అర్ధ రాత్రి నుంచి మార్చి 5 అర్థరాత్రి వరకు మూసివేయనున్నట్లు చెప్పారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ఎలాంటి అవకతవకలు లేకుండా విశ్వసనీయంగా నిర్వహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నాలుగు రోజుల పాటు ఇరు దేశాల మధ్య వస్తువుల ఎగుమతి, దిగుమతుల కూడా నిలిపివేయనున్నట్లు తెలిపారు. అత్యవసమరమైన మెడిసిన్, ఇతర కీలకమైన వస్తువుల రవాణా మాత్రం కొనసాగుతుందని చెప్పారు.

నేపాల్ సార్వత్రిక ఎన్నికలు:

2025లో జెన్ జెడ్ నిరసనలతో నేపాల్ అట్టుడికిన విషయం తెలిసిందే. కేపీ ఓలీ శర్మ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. జెన్ జెడ్ యువత నిరసనలతో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిమాణాలతో సుశీలా కర్కి నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 2026, మార్చి 5న నేపాల్‎లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

నేపాల్ ప్రతినిధుల సభలో మొత్తం 275 సీట్లు ఉండగా.. ఇందులో 165 సీట్లకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన 110 సీట్లకు దామాషా పద్ధతిలో ఎలక్షన్స్ నిర్వహిస్తారు. ఈ సారి గగన్ థాపా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ పార్టీ.. రబీ లామిచానే నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధానులు కేపీ శర్మ ఓలీ, పుష్ప కమల్ దహల్ ప్రచండ, మాధవ్ కుమార్ వంటి వారు ప్రముఖులు ఎన్నికల బరిలో ఉన్నారు. 

కేపీ శర్మ ఓలీ ఝాపా-5 నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఖాట్మండు మాజీ మేయర్ బాలేంద్ర షా బరిలోకి నిలిచారు. యూత్‎లో మంచి ఫాలోయింగ్ ఉన్న బాలేంద్ర షా మాజీ ప్రధాని కేపీ ఓలీ శర్మపై పోటీ చేస్తుండటంతో ఝాపా-5 నియోజకవర్గ ఎన్నికపై అందరి దృష్ట్యా నెలకొంది. ఈ ఎన్నికలలో సుమారు 1.9 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.