నేటి సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలను, ముసుగు వేసుకున్న మనుషుల నిజస్వరాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో దర్శకుడు విఘ్నేష్ కార్తిక్ సిద్ధహస్తుడు. 2024లో వచ్చిన 'హాట్ స్పాట్' చిత్రం ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో, అంతకంటే పదునైన సామాజిక అంశాలతో, బోల్డ్ కంటెంట్‌ను జోడించి తెరకెక్కించిన సీక్వెల్ ‘హాట్ స్పాట్ 2 మచ్’. జనవరి 23న థియేటర్లలో విడుదలైన హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫారమ్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అయింది.
షాకిచ్చే ట్విస్టులు!
మొదటి భాగం తరహాలోనే ఈ సీక్వెల్‌ను కూడా అంతాలజీ (Anthology) ఫార్మాట్‌లో రూపొందించారు. ఇందులో ప్రధానంగా మూడు కథలు ప్రేక్షకుడిని కుదిపేస్తాయి. నేటి కాలంలో స్టార్ హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో జరిగే యుద్ధాలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. తన కొడుకును ఈ ఫ్యాన్ వార్స్‌లో కోల్పోయిన తండ్రిగా ఎమ్మెస్ భాస్కర్ పండించిన నటన, ఆయన ఇచ్చే స్పీచ్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.
అమ్మాయిల దుస్తుల విషయంలో సమాజం చూసే కోణంపై దర్శకుడు గట్టి సెటైర్ వేశారు. తండ్రి (తంబి రామయ్య), కూతురు మధ్య సాగే ఈ కథలో వచ్చే ఒక అనూహ్యమైన ట్విస్ట్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తుంది. ఇది సున్నితమైన అంశాన్ని ఎంతో ధైర్యంగా చర్చించింది. 2050 నుంచి టైమ్ ట్రావెల్ చేసి వచ్చిన ఒక అమ్మాయితో సాగే ప్రేమకథ. భవిష్యత్తు గురించి ఇందులో వేసిన జోకులు నవ్వులు పూయించడమే కాకుండా, క్లైమాక్స్‌లో ఇచ్చే 'బోల్డ్' ముగింపు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
తారాగణం -
ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్, అశ్విన్ కుమార్, భవాని శ్రీ, ఆదిత్య భాస్కర్, బ్రిగిడా సాగా వంటి నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. విష్ణు విశాల్ స్టూడియోస్ సమర్పణలో, అనిల్ రెడ్డి ఎం, ముని చంద్రారెడ్డి ఎన్, ఇందుకుమార్ ఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
సమాజంలోని 'టాబూ' (Taboo) అంశాలను పచ్చిగా, నిజాయితీగా చెప్పే ప్రయత్నమే ఈ ‘హాట్ స్పాట్ 2 మచ్’. కేవలం వినోదం కోసమే కాకుండా, మన చుట్టూ జరుగుతున్న వింత పోకడలను ప్రశ్నించే ఈ సినిమా, బోల్డ్ అండ్ సోషల్ మెసేజ్ చిత్రాలను ఇష్టపడే వారికి ఒక 'మస్ట్ వాచ్' ఆప్షన్. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే ‘ఆహా’లో ఈ విలక్షణ చిత్రాన్ని చూసేయండి!
