ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాలనేది ఒకప్పుడు ఎంతోమంది భారతీయ విద్యార్థుల కల. కానీ.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమెరికాలో వీసాలపై నెలకొన్న అనిశ్చితి, ట్రంప్ పరిపాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాకు వెళ్లి చదువుకోవాలనే భారతీయ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లాయి. గ్రాడ్యుయేషన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (GMAC) తాజాగా విడుదల చేసిన శ్వేతపత్రంలోని అంశాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అమెరికా యూనివర్సిటీల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఆగస్ట్ 2025 నాటికి 45 శాతం తగ్గిందని శ్వేతపత్రంలో GMAC స్పష్టం చేసింది. అయితే.. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇండియన్ గ్రాడ్యుయేషన్ మేనేజ్మెంట్ ప్రోగ్సామ్స్కు దరఖాస్తుల సంఖ్య అంతర్జాతీయంగా 25 శాతం పెరగడం విశేషం.
వీసా పాలసీల్లో నెలకొన్న సమస్యలు, గందరగోళం కారణంగా.. ఉత్తర అమెరికా స్టడీ కారిడార్ ఆధిపత్యం దారుణంగా పడిపోయింది. ఈ పరిణామం.. ఆసియా దేశాలకు, ఐరోపా దేశాలకు అనుకూలంగా మారింది. అంతర్జాతీయంగా ఆసియా, ఐరోపా దేశాల్లో విదేశీ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కెనడా, అమెరికా, UKలో వీసా విధానంలో మార్పులు, రాజకీయ పరిస్థితులు వీసా దరఖాస్తులు తగ్గడానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
అమెరికాలో చదువుకోవాలనుకునే మన దేశ విద్యార్థులకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కష్టాలు తెచ్చిపెడుతున్న సంగతి తెలిసిందే. వీసా రూల్స్ను కఠినతరం చేయడం, వలస చట్టాలకు ట్రంప్పదును పెట్టడంతో అక్కడ చదువుకోవాలనుకునే వారికి ఈ నిర్ణయాలు తలనొప్పిగా మారాయి. గతంలో ఎన్నడూ లేనంతగా విద్యార్థుల వీసాలు తిరస్కరణకు గురవుతున్నాయి. వీసా వచ్చినవాళ్లు అక్కడ చదువుకుందామని అనుకున్నా.. ఆ చదువుల ఖర్చూ తడిసి మోపెడవుతున్నది. ఇటు పార్ట్ టైం జాబ్‌లు చేసుకోవడానికీ అవకాశాలు లేకుండా పోతుండడంతో అమెరికా మీద స్టూడెంట్స్ ఆశలు వదిలేసుకుంటున్నారు. ఆ దేశానికి బదులు ఇతర దేశాలపై ఆసక్తి చూపిస్తున్నారు.
అమెరికాలో ఫీజులు కూడా భారంగా మారుతున్నాయి. గత ఐదేండ్లతో పోలిస్తే అక్కడ చదువుల ఖర్చులు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం ప్రైవేట్వర్సిటీల్లో చదవాలంటే రూ.40 లక్షల దాకా ఖర్చు చేయాల్సి వస్తున్నది. గతంలో రూ.25 లక్షల వరకు ఖర్చయ్యేది. ప్రభుత్వ వర్సిటీల్లో చదివేందుకు రూ.17 లక్షల దాకా ప్రస్తుతం ఖర్చు చేయాల్సిన పరిస్థితులున్నాయని, గతంలో అందులో సగమే ఉండేదని స్టూడెంట్స్ చెబుతున్నారు. ఇప్పుడు తిండి తిప్పలు, ఇతరత్రా ఖర్చులకూ ఏటా రూ.12 లక్షలు, హెల్త్ ఇన్సూరెన్స్కు మరో రూ.లక్షన్నర దాకా ఖర్చు చేయాల్సి వస్తున్నదని అంటున్నారు.
