న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ ప్రత్యేక తీర్పు వెలువరించడంతో ఢిల్లీ పాలిటిక్స్ హీటెక్కాయి. బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ, బీజేపీకి ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
శుక్రవారం (ఫిభ్రవరి 27) కోర్టు తీర్పు తర్వాత కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టండి.. బీజేపీ 10 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు. ఈ కేసు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ పన్నిన కుట్ర అని.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద రాజకీయ కుట్ర అని కేజ్రీవాల్ అభివర్ణించారు.
ఆప్ వంటి ప్రాంతీయ పార్టీలను నాశనం చేయాలని ప్రయత్నించడం కంటే. ప్రధాని మోడీ, అమిత్ షా దేశ ప్రయోజనాల కోసం పనిచేయడంపై దృష్టి పెట్టాలని చురకలంటించారు. అధికారం కోసం ఎవరూ దేశంతో రాజ్యాంగంతో ఆటలాడకూడదని హెచ్చరించారు. లిక్కర్ పాలసీ కేసు మొత్తం కల్పితమని కోర్టు తీర్పు ద్వారా స్పష్టమైంది... మేం కూడా మొదటి నుంచే ఇదే విషయం చెబుతున్నామని పేర్కొన్నారు.
కోర్టు తీర్పును స్వాగతించిన కేజ్రీవాల్.. చివరకు న్యాయం జరిగిందని, అబద్ధంపై నిజం గెలిచిందని అన్నారు. ఈ కేసులో బలంగా వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో సహా తన న్యాయ బృందానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అక్రమ కేసులు బనాయించి తమను ఇబ్బంది పెట్టిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
