రాజకీయ బతుకమ్మ.. బీఆర్ఎస్ ఆఫీసులో పొలిటికల్ సాంగ్స్ రిలీజ్

రాజకీయ  బతుకమ్మ.. బీఆర్ఎస్ ఆఫీసులో పొలిటికల్ సాంగ్స్ రిలీజ్

= పండుగ పూట సర్కారుపై విమర్శల పాటలు

= బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అట
= విశ్వవ్యాప్తం చేసింది ఆయనేనంటున్న లీడర్లు
= ఎమ్మెల్సీ కవిత పేరు గుర్తు చేయకుండా మీటింగ్
= కవితను ప్రస్తావించి నాలుక్కరుచుకున్న సునీత
= మాలోత్ కవిత అంటూ సవరించుకొని సమాధానం

హైదరాబాద్: బీఆర్ఎస్  పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‎లో ఇవాళ బతుకమ్మ పాటలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేశారు. అవన్నీ రాజకీయ పాటలే కావడం గమనార్హం. పండగపూట సర్కారును విమర్శిస్తూ ఉయ్యాల అన్న చరణంతో ఈ  పాటలను వండి వార్చారు. మార్పు మార్పని వలలో మనలను ముంచిండ్రే వలలో అంటూ ఓ పాట.. మార్పు  మార్పని మనం చేయి గుర్తుకు ఓటేస్తె అంటూ మరో పాట.. ఆరు గ్యారెంటీలు ఉయ్యాలో ఆగమే జేసిండ్రు ఉయ్యాలో అంటూ మరో పాటను ఈ సందర్భంగా కేటీఆర్ ఆవిష్కరించారు. 

బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆత్మ.. ఈ గడ్డకు పరిమితమైన పూల సింగిడి. ఆడబిడ్డల పండుగ.. ఈ పండగపూట పురాణ గాథలు, కథలు, రామాయణ, మహాభారత ఘట్టాలను పాటలుగా పాడుతూ ఉంటారు. తరతరాలుగా వస్తున్న పాటల మాదిరిగా రాజకీయ విమర్శలను చేస్తూ పాటలు రాసి పాడించి మరీ వాటిని ఆవిష్కరించారు. ఈ పాటలు నిజంగా బతుకమ్మ దగ్గర పాడేలాన ఉన్నాయా..? పాడుతారా..? అనేది పక్కన పెడితే బతుకమ్మ లాంటి పండుగను కూడా రాజకీయ వేదికగా వాడుకునేందుకు యత్నిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. 

బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్..!!

మొన్నటి వరకు బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసింది కవితమ్మ.. బ్రాండ్ అంబాసిడర్ ఆమెనే అంటూ చెప్పిన వాళ్లు సడెన్‎గా ఇవాళ మాటమార్చేశారు. బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అని పాటల విడుదల సందర్బంగా చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బతుకమ్మ ను తెలంగాణ నుంచి వేరు చేసి రేవంత్ రెడ్డి మహిళల హృదయాలను గాయపరిచారన్నారు.  

ఈ నేల స్వభావం తెలిసిన పాలన మళ్ళీ రావాలని అన్నారు. పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ మూడు పాటలను స్పెషల్‎గా రాయించామని చెప్పుకొచ్చారు. బతుకమ్మ పండుగను గొప్పగా నిర్వహించామని చెప్పారు. కోటి మంది మహిళలను బతుకమ్మ చీరలతో గౌరవించిన నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తన పాలనలో ఆడపడుచులను కన్నతండ్రిలా చూసుకున్నారని చెప్పారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మ మాయం చేశారంటూ విమర్శలు చేశారు. ప్రభుత్వ ఆఫీసుల్లో బతుకమ్మ ఆడుకునే అవకాశం కేసీఆర్ ఇచ్చారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. బతుకమ్మ పండుగ కోసం లంబాడీ ఆడబిడ్డలు ఎదురుచూస్తుంటారని మాజీ ఎంపీ మాలోత్ కవిత చెప్పారు. 

జాగృతి టు బీఆర్ఎస్

తెలంగాణ జాగృతి సంస్థ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు బతుకమ్మ పండుగను కల్వకుంట్ల కవిత నిర్వహించే వారు. ఇందుకోసం ప్రత్యేకంగా పాటలు సిద్ధం చేసేవారు. అందులో రాజకీయాలకు తావులేకుండా బతుకమ్మ  ప్రాశస్త్యాన్ని వివరించే అంశాలే ఉండేవి. ఇప్పుడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విడుదల చేసిన బతుకమ్మ పాటలన్నీ రాజకీయ పాటలే కావడం విమర్శలకు తావిస్తోంది. 

21న పుట్టిన ఊరికి కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను తాను పుట్టిన ఊరు చింతమడక ఆహ్వానించింది. ఈ నెల 21న నిర్వహించే ఎంగిలిపూల బతుకమ్మ పండుగకు రావాలంటూ గ్రామస్తులు కవితను ఆహ్వానించారు. కవితను  సిద్దిపేట జిల్లా చింతమడక వాసులు ఆహ్వానించడం విశేషం. తెలంగాణ భవన్‎లో రాజకీయ పాటలను బీఆర్ఎస్ విడుదల చేయడం, కవిత చింత మడకలో బతుకమ్మ పండుగకు వెళ్తుండటం హాట్ టాపిక్‎గా  మారాయి.