Chiranjeevi: టాలీవుడ్ చరిత్ర తిరగరాసిన మెగాస్టార్.. 25 రోజుల్లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ఊహించని వసూళ్లు.

 Chiranjeevi: టాలీవుడ్ చరిత్ర తిరగరాసిన మెగాస్టార్.. 25 రోజుల్లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ఊహించని వసూళ్లు.

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో  సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం 'మనశంకర వరప్రసాద్ గారు'.  తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం.. కేవలం పండుగ సినిమాగానే కాకుండా టాలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అనిల్ కామెడీ మార్క్ , మెగాస్టార్ వింటేజ్ స్వాగ్ తోడై ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

25 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

ఈ మూవీ లేటెస్ట్ గా థియేటర్లలో 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈ స్వల్ప కాలంలోనే ఏకంగా రూ. 375 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్‌టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా అవతరించిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విశేషమేమిటంటే, కేవలం తెలుగు వెర్షన్‌లో మాత్రమే విడుదలై ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టడం భారతీయ సినీ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు. ఇప్పటివరకు సంక్రాంతి రేసులో రూ. 300 కోట్ల మార్కుతో టాప్‌లో ఉన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ రికార్డును చిరు తన స్టామినాతో అధిగమించారు.

తొలి వారంలోనే రికార్డుల వేట

మొదటి వారంలోనే ఈ చిత్రం రూ. 292 కోట్లు వసూలు చేసి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు బుక్‌మైషోలో 40 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం చిరంజీవి క్రేజ్‌కు అద్దం పడుతోందంటున్నారు అభిమానులు. అత్తారింటికి దారేది, గుంటూరు కారం, సర్కారు వారి పాట వంటి భారీ చిత్రాల లైఫ్ టైమ్ కలెక్షన్లను ఈ సినిమా కేవలం మూడు వారాల్లోనే దాటేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మెగాస్టార్ తన సత్తా చాటారు. సుమారు 5 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించి, చిరు కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓవర్సీస్ గ్రాసర్‌గా ఈ చిత్రం నిలిచింది. అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.

►ALSO READ | Naga Chaitanya: వెన్నులో వణుకు పుట్టించే 'దూత 2'.. నాగచైతన్య-విక్రమ్ కుమార్ కాంబోలో క్రేజీ సీక్వెల్!

సినిమా హైలైట్స్

ఇంద్ర, ఠాగూర్ వంటి సినిమాల్లోని చిరు మ్యానరిజమ్స్‌ను అనిల్ రావిపూడి అద్భుతంగా రీక్రియేట్ చేశారు. మెగాస్టార్‌తో పాటు విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచింది. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సీక్వెన్స్ థియేటర్లను హోరెత్తించాయి. భీమ్స్ సిసిరోలియో అందించిన మాస్ బీట్స్, సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాణ విలువల వల్ల సినిమా విజువల్ గ్రాండ్‌గా నిలిచింది. మెగాస్టార్ సరసన నయనతార నటన సినిమాకు ఒక క్లాస్ టచ్ ఇచ్చింది.

మొత్తానికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ పేరుతో చిరంజీవి బాక్సాఫీస్ వద్ద పెట్టిన సంతకం ఇప్పుడు టాలీవుడ్ హిస్టరీలో చెరగని ముద్రగా మారింది. సంక్రాంతి విన్నర్‌గా నిలవడమే కాకుండా, 2026 నాటి అతిపెద్ద తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించిన చిరుకు అభిమానులు జేజేలు పలుకుతున్నారు.