OG బెన్ఫిట్ షో బుకింగ్స్ ఓపెన్.. టికెట్ వెయ్యి రూపాయలు.. రెస్పాన్స్ ఎలా ఉందంటే..

OG బెన్ఫిట్ షో బుకింగ్స్ ఓపెన్.. టికెట్ వెయ్యి రూపాయలు.. రెస్పాన్స్ ఎలా ఉందంటే..

ఆంధ్రాలో OG బెన్ ఫిట్ షో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. గుంటూరులోని లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఉన్న హాలీవుడ్ బాలీవుడ్ థియేటర్స్లో, శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ థియేటర్లో OG సినిమా అర్ధరాత్రి 1 AM షో టికెట్స్ను district యాప్లో, వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. టికెట్ ధర వెయ్యి రూపాయలు అని జీవోలో స్పష్టం చేసినట్టే టికెట్ ధర 1000 రూపాయలు ఉండగా, బుకింగ్ ఛార్జ్, IGST అన్నీ కలిపి 1042 రూపాయలకు టికెట్ ధర చేరడం గమనార్హం.

అయినా సరే.. పవన్ కల్యాణ్ అభిమానులు టికెట్లను బుక్ చేసుకోవడంలో ఏమాత్రం వెనకాడటం లేదు. వెయ్యి రూపాయల టికెట్లకు కూడా మంచి రెస్పాన్సే ఉంది. హరిహరవీరమల్లు పరాజయంతో పవన్ అభిమానులు ఈ OG సినిమాపై బీభత్సమైన అంచనాల్లో ఉన్నారు. ట్రైలర్ రిలీజ్ డేట్ను కూడా ఇప్పటికే ప్రకటించేశారు. పవన్ కల్యాణ్ OG సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 21న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఏపీలో OG సినిమా టికెట్ రేట్లపై స్పష్టత వచ్చేసింది.

తెలంగాణలో ప్రీమియర్ షోస్ ఉంటాయో.. లేదో.. టికెట్ ధరల పెంపు ఉంటుందో.. లేదో.. అనే విషయాల్లో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఏపీలో సెప్టెంబర్ 25న అర్ధరాత్రి ఒంటి గంట షో మాత్రమే ఉంది. వేకువజామున 4 గంటల షో గానీ, ఉదయం 8 గంటల షో గానీ ప్రస్తుతానికైతే లేదు. తెలంగాణలో పుష్ప2 సినిమా బెన్ ఫిట్ షోకు సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్లో టికెట్ ధరలు తెలంగాణ ప్రభుత్వం 800 రూపాయలుగా అప్పట్లో ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

బెన్ ఫిట్ షో, ప్రీమియర్ షోస్ టికెట్ ధరలు తెలంగాణలో అధికారికంగా ఇంత పలికిన సినిమా ఇప్పటికైతే పుష్ప2నే కావడం గమనార్హం. OG సినిమా బెన్ ఫిట్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తుందో.. లేదో.. ఒకవేళ పర్మిషన్ ఇస్తే టికెట్ ధర పుష్ప2 బెన్ ఫిట్ షో టికెట్ను మించి ఉంటుందేమోననే డిస్కషన్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.