హైదరాబాద్ లోని మంగళహాట్ లో నిల్వచేసిన మాంసం దందా గుట్టురట్టయ్యింది. మంగళహాట్ పోలీసులు, గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ అడల్టరేషన్ టీం, GHMC అధికారులు సంయుక్తంగా నిర్వహించిన అపరిశుభ్రంగా నిల్వచేసిన మాంసం అమ్మకాల దందా వెలుగులోకి వచ్చింది. ఈ తనిఖీల్లో పలు దుకాణాల్లో అపరిశుభ్రంగా ఎక్కువ కాలం నిల్వచేసిన మాంసాన్ని అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు.
ఈ దాడిలో అమర్ నగర్ కాలనీ, మంగళ్‌హాట్ నివాసి మొహమ్మద్ అఫ్రోజ్ అలియాస్ అఫ్రోజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు A to Z Sheep & Goat Offals పేరుతో హౌస్ నంబర్ 13-1-145, ఆర్‌కే పెట్, చిష్తీ చమన్ దర్గా, మంగళ్‌హాట్ లో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
నిందితుడు కర్ణాటక, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల నుండి తక్కువ ధరలకు గొర్రెలు, మేక అవయవాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి, వాటిని ఎక్కువకాలం డీప్ ఫ్రీజర్లు మరియు నిల్వ నీటితో నింపిన ప్లాస్టిక్ టబ్బుల్లో నిల్వ చేసి అమ్ముతున్నాడని... దుర్వాసన తగ్గేలా చేసి పాడైపోయిన మాంసాన్ని తాజా మరియు పరిశుభ్రమైన మాంసంలా చూపిస్తూ వినియోగదారులకు విక్రయిస్తున్నాడని తెలిపారు పోలీసులు. అమాయక వినియోగదారులను మోసం చేయడంతో పాటు ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగించాడని పేర్కొన్నారు పోలీసులు.
దాడుల సమయంలో అధికారులు సుమారు 300 కిలోల వరకు కుళ్లిపోయిన గొర్రె, మేక అవయవాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం వాటిని GHMC అధికారులు నిబంధనల ప్రకారం సురక్షితంగా నిర్వీర్యం చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనపై మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నం.102/2026 కింద BNS సెక్షన్లు 125, 271, 318(2) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని... నిందితుడు గతంలో ఇదే తరహా నేరాలకు పాల్పడ్డాడని.. అప్పట్లో GHMC అధికారులు జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.
ప్రజలు అనుమతి లేని లేదా అపరిశుభ్రమైన ప్రదేశాల నుండి మాంసం లేదా ఆహార పదార్థాలు కొనుగోలు చేయవద్దని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
