వార్ ఎఫెక్ట్: ఉస్మానియా యూనివర్సిటీలో కట్టెల పొయ్యిపై వంటలు

వార్ ఎఫెక్ట్: ఉస్మానియా యూనివర్సిటీలో కట్టెల పొయ్యిపై వంటలు

ఈ యుద్ధం చూస్తుంటే.. కొన్నాళ్లు ఇలాగే కొనసాగితే హోటళ్లు, హాస్టళ్లు పూర్తిగా మూసివేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం కారణంగా ఇప్పటికే ఇండియాలో మెట్రో సిటీల్లో పలు హోటళ్లు మూతపడ్డాయి. హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి. ప్రవేటు హాస్టళ్లలో మెనూ తగ్గించడం, కట్టెలపొయ్యిపై వంటలు చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ప్రైవేటు హాస్టళ్లే కాదు.. ఉస్మానియా వంటి పెద్ద యూనివర్సిటీలోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఆందోళన కలిగించే విషయం. 

ఉస్మానియా యూనివర్సిటీలో గ్యాస్ స్టవ్ కు బదులు.. కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు సిబ్బంది.  యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా తగ్గటంతో కట్టెల పొయ్యిపైన వండాల్సి వస్తోందని వార్డెన్స్ చెబుతున్నారు. కట్టెల పొయ్యితో వంటలు చేయడం కారణంగా విద్యార్థులకు భోజనం అందించడం ఆలస్యం అవుతున్నట్లు చెబుతున్నారు. 

ఓయూ హాస్టల్స్ లో ఇదివరకు రోజుకు 3 నుంచి 4 సిలిండర్లు వాడి వంటలు చేసేవారు. కానీ సప్లై తగ్గడంతో కట్టెల పొయ్యిపై ఎక్కువ వంటలు వండాల్సి వస్తుందని సిబ్బంది తెలిపారు. దీంతో కట్టెల కొనుగోలు ఎక్కువగా చేయాల్సి వస్తుందని అంటున్నారు.