ముంబైలో ఈ గ్యాస్ గోల ఏంట్రా బాబూ.. ఏజెన్సీల దగ్గర క్యూలు, జనం వర్రీలు

 ముంబైలో ఈ గ్యాస్ గోల ఏంట్రా బాబూ.. ఏజెన్సీల దగ్గర క్యూలు, జనం వర్రీలు

నవీ ముంబైలో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. దింతో సామాన్య ప్రజల నుండి హోటల్ యజమానుల వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాన్‌పాడలోని 'సంపాడ గ్యాస్ సర్వీస్' దగ్గర తెల్లవారుజాము నుంచే జనం క్యూ కడుతున్నారు. ఖాళీ సిలిండర్లతో రోడ్ల మీద వేచి ఉన్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లలో  వాడే కమర్షియల్ సిలిండర్లు దొరకడం లేదు. దీనివల్ల ముంబైలోని సుమారు 35% హోటళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. గ్యాస్ లేకపోవడంతో చాలా హోటళ్లు మెనూలో మార్పులు చేస్తూ కొన్ని  రకాల వంటకాలను వండటం మానేశాయి.

హోటల్ సంఘాల ఆందోళన:
హోటల్స్ అసోసియేషన్ (AHAR) అధ్యక్షుడు విజయ్ శెట్టి మాట్లాడుతూ.. మంగళవారం 20% ఉన్న హోటళ్ల మూసివేత, బుధవారానికి 35 శాతానికి చేరిందని, పరిస్థితి ఇలాగే ఉంటే మరిన్ని హోటళ్లు మూతపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాజకీయ నిరసనలు:
ఈ సమస్యపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తోంది. గ్యాస్ కొరతను నిరసిస్తూ, ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మార్చి 13, 14 తేదీల్లో ముంబై అంతటా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. వంట గ్యాస్ సరఫరా త్వరగా సాధారణ స్థితికి రాకపోతే, రాబోయే రెండు మూడు రోజుల్లో పరిస్థితి ఇంకా దారుణంగా మారే ప్రమాదం ఉంది.