ఈ ఆదివారం తొలి ఏకాదశి : పేలాల పిండి ఎందుకు తినాలి.. ఎలా తయారు చేయాలి..

ఈ ఆదివారం తొలి ఏకాదశి : పేలాల పిండి ఎందుకు తినాలి.. ఎలా తయారు చేయాలి..

హిందూ మతంలో చాలా ముఖ్యమైన పండుగలలో  పేలాల పండుగ ఒకటి.ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి రోజున ( జులై 6)  జరుపుకుంటారు.ఆ  రోజున, విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు అని నమ్ముతారు. పేలాల పండుగను ఎందుకు జరుపుకోవాలి... ఆరోజు పేలాలపిండి ఎందుకు తినాలి.. దానిని  ఎలా తయారు చేయాలి. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. .  .!

తొలి ఏకాదశి రోజున పేలాల పిండి తినడం వల్ల మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు.ఈ రోజున పేల పిండి తినడం వలన సంవత్సరం పొడవునా ఆరోగ్యంగా ఉండవచ్చని నమ్మకం. ఇది భవిష్యత్తులో వచ్చే కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుందని భావిస్తారు.

పేలాల పిండి ఎందుకు తినాలి?

తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ( జులై 6) ఆలయాల్లో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది.

పేలాలపిండి ఎలా తయారుచేయాలి..

జొన్న పేలాల పిండి తయారీ విధానం ఇలా :

  • మొదటగా ఓ కప్పు జొన్నలు లేదా మొక్కజొక్కలు తీసుకోవాలి. జొన్నలు తీసుకున్నట్లయితే వాటిని వేడి నీళ్లల్లో కొంచెం సేపు ఉడికించాలి. 
  •  ఆ తర్వాత ఉడికించిన జొన్నలను కనీసం గంట నుంచి రెండు గంటలపాటు ఆరబెట్టుకోవాలి. 
  •  జొన్నలు బాగా ఆరిన తర్వాత స్టవ్ వెలిగించి.. వాటిని పేలాలుగా మార్చుకోవాలి. 
  •  పేలాలను ఓ మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
  •  అదే మిక్సీలో బెల్లం, కొబ్బరి ముక్కలు, ఐదు యాలుకలు వేసి మొత్తగా చేసుకోవాలి. 
  • ఆ తర్వాత కొంచెం పుట్నాలు వేసి మెత్తగా పిండి చేసుకోవాలి. 
  •  జొన్న పేలాల పిండిలో పుట్నాల పిండితోపాటు బెల్లం, కొబ్బరి, యాలుకలతో చేసిన మిశ్రమాన్ని కలపుకుంటే.. ఘుమఘుమలాడే జొన్న పేలాల పిండి తయారు అవుతుంది.
  • మొక్కజొన్న పేలాల పిండి కూడా ఇదే తరహాలో తయారు చేసుకోవాలి.

 

►ALSO READ | Childrens Health : ఇంట్లో పిల్లలను ఒంటరిగా వదిలి వెళుతున్నారా.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు వద్దు..!