ప్రయాణికులకు ఉబర్ ఫ్రీ ఇన్సూరెన్స్

ప్రయాణికులకు ఉబర్ ఫ్రీ ఇన్సూరెన్స్

న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన రైడ్ షేరింగ్ కంపెనీ ఉబర్, తన ప్రయాణికులకు ఉచితంగా ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తోంది. తన ప్లాట్‌‌ఫామ్ ద్వారా కార్లు, ఆటోలు, మోటార్‌‌‌‌సైకిళ్లపై ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లేమైనా సంభవిస్తే.. ఈ ఇన్సూరెన్స్‌‌ను రైడర్లకు అందించనుంది. ప్రమాదవశాత్తు మరణించినా లేదా దివ్యాంగులైనా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభించనుంది. ఒకవేళ ఆసుపత్రి పాలైతే రూ.2 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. దీనిలోనే ఓపీడీ ప్రయోజనాలు రూ.50 వేల వరకు ఉంటాయి. 40కి పైగా ఇండియన్ సిటీల్లో కార్యకలాపాలు సాగిస్తోన్న ఉబర్, కారు రైడర్లకు ఇన్సూరెన్స్ అందించడం కోసం భారతీ ఏఎక్స్‌‌ఏతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆటో,మోటార్ సైకిల్ రైడర్స్ కోసం టాటా ఏఐజీతో జత కట్టింది. ‘మా రైడర్లకు సురక్షితమైన, ఎటువంటి ఆటంకాలు లేని రైడ్స్‌‌ను అందించేందుకు ఫోకస్ చేస్తున్నాం. ఇప్పటికే మా డ్రైవర్ పార్టనర్లకు ఇన్సూరెన్స్ అందిస్తున్నాం. ప్రస్తుతం మేము తీసుకున్న నిర్ణయంతో ఉబర్ రైడర్లకు మరింత సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తామని భావిస్తున్నాం’ అని ఉబర్‌‌‌‌ ఇండియా, దక్షిణాసియా సెంట్రల్ ఆపరేషన్స్ హెడ్ పవన్ వైష్ చెప్పారు. ఉబర్ ప్రత్యర్థి ఓలా కూడా రైడర్లకు ఇలాంటి ఇన్సూరెన్స్‌‌నే ఆఫర్ చేస్తోంది. అయితే ఒక్కో రైడ్‌‌కు రెండు రూపాయలతో ఈ ఇన్సూరెన్స్‌‌ ఫెసిలిటీని ఓలా రైడర్లు ఎంపిక చేసుకోవచ్చు. ఒక్కోవెహికిల్‌‌లో ఒకరి కంటే ఎక్కువ మంది రైడర్లుంటే, ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రతి ఒక్క ట్రావెలర్‌‌‌‌కు వర్తిస్తుందని ఉబర్​ చెప్పింది. ఉబర్‌‌‌‌కు యాక్సిడెంట్‌‌ను రిపోర్ట్ చేయడానికి రైడర్లు ‘పాస్ట్ ట్రిప్స్’సెక్షన్‌‌లోకి వెళ్లి, తనకు యాక్సిడెంట్ అయిన విషయాన్ని తెలియజేయాలి. ‘ఐ వాజ్ ఇన్‌‌వాల్వడ్ ఇన్ యాన్ యాక్సిడెంట్’ఆప్షన్‌‌ లోకి వెళ్లాలి. ఆ తర్వాత ఉబర్‌‌‌‌ సపోర్ట్ టీమ్ రైడర్‌‌‌‌ను సంప్రదించి, ఇన్సూరెన్స్‌‌ పార్టనర్‌‌‌‌తో కోఆర్డినేట్ అయి వారి క్లయిమ్ ప్రాసెస్‌‌ను పూర్తి చేస్తుంది.