వీడు.. ఇద్దరు తల్లులు కన్నబిడ్డ!

వీడు.. ఇద్దరు తల్లులు కన్నబిడ్డ!
  •                 బ్రిటన్ లో తొలిసారి ‘2–వూంబ్ బేబీ’ జననం 
  •                 ఇద్దరు తల్లుల గర్భంలో పెరిగిన మగబిడ్డ
  •                 ‘ఇన్ వైవో నేచురల్ ఫెర్టిలైజేషన్’ సక్సెస్

ఎవరికైనా కన్నతల్లి ఒక్కరే ఉంటారు. నవ మాసాలు కడుపులో మోసి, జన్మనిచ్చే అసలైన అమ్మ ఒక్కరే ఉంటారు. ఐవీఎఫ్​ద్వారా లేదా సహజంగా పుట్టినా.. ఏ బిడ్డ అయినా ఒకే తల్లి కడుపులో పెరిగి, ఈ భూమి మీదకు రావాల్సిందే. కానీ.. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఒక తల్లి కొన్ని రోజులు బిడ్డను మోశాక, ఇంకో తల్లి కడుపులోకి ఆ బిడ్డను మార్చేందుకూ చాన్స్ దొరికింది. ఇలాంటి ప్రొసీజర్ లోనే  బ్రిటన్ లో తొలిసారిగా ఇద్దరు తల్లులు తమ బిడ్డను కడుపులో మోశారు! జాస్మిన్, డోనా ఫ్రాన్సిస్ స్మిత్ అనే వాళ్లిద్దరూ లెస్బియన్ దంపతులు కావడం మరో విశేషం. డాక్టర్లు ఒక తల్లి గర్భంలో పిండం డెవలప్ అయ్యాక, మరొక తల్లి గర్భంలోకి మార్చి, సహజంగా ఓ పండంటి మగబిడ్డకు పురుడుపోశారు! ఓటిస్ అనే ఆ బుడ్డోడి వయసు ఇప్పుడు రెండు నెలలు!

ఇదీ స్టోరీ..

బ్రిటన్ కు చెందిన జాస్మిన్, డోనా ఫ్రాన్సిస్ స్మిత్ లెస్బియన్ దంపతులు. ఇద్దరూ ఓ బిడ్డను కనాలని డిసైడ్ అయ్యారు. ఐవీఎఫ్​ పద్ధతిలో వరల్డ్ ఫేమస్ అయిన లండన్ ఉమెన్స్ క్లినిక్ డాక్టర్లను సంప్రదించారు. దీంతో వారు స్విస్ కంపెనీ అనెకోవా డెవలప్ చేసిన ‘ఇన్ వైవో నేచురల్ ఫెర్టిలైజేషన్ (దీనిని అనెవైవో ప్రొసీజర్ అని కూడా పిలుస్తారు)’ పద్ధతిలో వారికి సంతాన భాగ్యం కలిగించాలని నిర్ణయించారు. మామూలుగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్​) పద్ధతిలో అయితే తల్లి నుంచి అండం సేకరించి, బయట టెస్ట్ ట్యూబ్ లో అండానికి డోనర్ స్పెర్మ్ కలిసేలా చేసి ఫెర్టిలైజేషన్ చేస్తారు. కానీ ఇన్ వైవో నేచురల్ ఫెర్టిలైజేషన్ లో మాత్రం తల్లి గర్భంలోనే అండాన్ని ఫెర్టిలైజ్ చేశారు. ఈ పద్ధతిలో ముందుగా ఒక చిన్న క్యాప్సూల్ వంటి దాంట్లో అండాలను ఉంచి, డోనా గర్భంలోకి ప్రవేశపెట్టారు. నేరుగా అక్కడికి డోనర్ స్పెర్మ్ ను ప్రవేశపెట్టి, సహజంగా ఫెర్టిలైజేషన్ అయ్యేలా చేశారు. ఇలా ఆమె కడుపులో ఫెర్టిలైజ్ అయిన అండాన్ని 18 గంటల పాటు ఉంచిన తర్వాత జాస్మిన్ గర్భంలోకి మార్చారు. దీంతో జాస్మిన్ గర్భంలో పిండం పూర్తిగా ఎదిగి, సహజ ప్రసవం ద్వారా మగబిడ్డ పుట్టాడు.

ఇద్దరు తల్లులూ ఫుల్ ఖుష్​

సాధారణంగా ఇలాంటి పద్ధతుల్లో మొదటి ప్రయత్నంలోనే పిల్లలు పుట్టడం చాలా అరుదు. కానీ తాము తొలి ప్రయత్నంలోనే పండంటి బిడ్డను కన్నందుకు ఎంతో అదృష్టవంతులమని జాస్మిన్, డోనా పొంగిపోతున్నారు. తమ ముద్దుల బిడ్డకు తామిద్దరమూ రక్తం పంచామని, ఇద్దరమూ అసలైన కన్నతల్లులమే అయ్యామని వారు పట్టలేని ఆనందంతో చెప్పుకొంటూ మురిసిపోతున్నారు. నార్తాంప్టన్ షైర్ కు చెందిన జాస్మిన్ డెంటల్ నర్స్ గా పని చేస్తున్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఫెర్టిలిటీ ట్రీట్ మెంట్లో లండన్ ఉమెన్స్ క్లినిక్ 1985 నుంచే ముందంజలో ఉందని ఆ హాస్పిటల్ సైంటిఫిక్ డైరెక్టర్ కమల్ ఆహుజా తెలిపారు. అనెకోవా ప్రొసీజర్ లో తొలి బిడ్డను పుట్టించడంలో తాము విజయవంతం కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

అమెరికాలో గత ఏడాదే సక్సెస్ 

అమెరికాలోని టెక్సాస్ లోనూ ఓ లెస్బియన్ జంటకు గత ఏడాది ఇలాంటి పద్ధతిలోనే డాక్టర్లు సంతానప్రాప్తి కలిగించారు. ఆష్లీ, బ్లిస్ కౌల్టర్ అనే ఇద్దరు మహిళలు ఆ బిడ్డను కన్నారు. మొదట బ్లిస్ నుంచి అండాలను సేకరించిన డాక్టర్లు డోనర్ స్పెర్మ్ ద్వారా ల్యాబ్ లో ఫెర్టిలైజ్ చేశారు. తర్వాత దానిని బ్లిస్ గర్భంలోకి ప్రవేశపెట్టారు. అయితే, ఆమె బిడ్డను నవ మాసాలూ మోసేందుకు ఇష్టపడకపోవడంతో, ఆ పిండాన్ని ఐదు రోజుల తర్వాత ఆష్లీ గర్భంలోకి మార్చారు. ఆష్లీ తొమ్మిది నెలలు మోసి, ఆ బిడ్డకు జన్మనిచ్చింది.