4, 29, 46, 81, 108.. ఈ జీవోలన్నీ రద్దు చేయాలి... వెంటనే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలి: ధర్నా చౌక్ లో నిరుద్యోగుల ఆవేదన సభ

4, 29, 46, 81, 108.. ఈ జీవోలన్నీ రద్దు చేయాలి... వెంటనే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలి: ధర్నా చౌక్ లో నిరుద్యోగుల ఆవేదన సభ

ముషీరాబాద్, వెలుగు: నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న జీవో నంబర్లు 4, 29, 46, 81, 108లను తక్షణమే రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. బుధవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ‘నిరుద్యోగుల ఆవేదన సభ’ నిర్వహించారు. డీఎస్సీ, గురుకుల, మోడల్ స్కూల్స్, జేఎల్, డీఎల్, ఎస్సై, పీసీ, గ్రూప్స్, పవర్ సెక్టార్ వంటి అన్ని రకాల ఉద్యోగ నోటిఫికేషన్లను జూన్ 2 లోపు విడుదల చేయాలని.. లేనిపక్షంలో మళ్లీ తెలంగాణ ఉద్యమ తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. 

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు గెల్లు శ్రీనివాస్, అస్మా, కిరణ్ రాథోడ్, వెంకటేష్, ధర్మారపు పవన్ కుమార్ తదితరులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోందని, 30 లక్షల మంది నిరుద్యోగుల ఆశలు అడుగంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, యువ వికాసం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచిందని, ఉద్యోగాలు లేని జాబ్ క్యాలెండర్​ను రెండుసార్లు విడుదల చేసి తమ మనోభావాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. 

వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచినా, దానికి కేవలం ఒక్క ఏడాది మాత్రమే వాలిడిటీ ఇవ్వడం అన్యాయమన్నారు. గత రెండున్నరేండ్లుగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు.