డీలిమిటేషన్‌‌, మహిళా రిజర్వేషన్లతో సీఎం రేవంత్‎లో డిప్రెషన్‌:‌ బండి సంజయ్‌‌

డీలిమిటేషన్‌‌, మహిళా రిజర్వేషన్లతో సీఎం రేవంత్‎లో డిప్రెషన్‌:‌ బండి సంజయ్‌‌

కరీంనగర్, వెలుగు: ‘నియోజకవర్గాల పునర్విభజన, 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో సీఎం రేవంత్‌‌ రెడ్డిలో డిప్రెషన్‌‌ మొదలైంది. అందుకే ప్రధానిపై దిగజారి మాట్లాడుతున్నరు. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని దుష్ర్పచారం చేస్తున్నరు’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌ కుమార్‌‌ విమర్శించారు.

 కరీంనగర్‌‌లోని తన నివాసంలో శనివారం మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి జరిగే నష్టం ఏమిటో సీఎం రేవంత్‌‌ రెడ్డి ఇప్పటి వరకు చెప్పడం లేదన్నారు. అన్ని రాష్ట్రాల్లో 50 శాతం నియోజకవర్గాలు పెరుగుతున్నప్పుడు దక్షిణాదికి అన్యాయం ఎట్లా జరుగుతుందని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఉత్తరాది, దక్షిణాది అంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. 

రాజకీయాలను పక్కనపెట్టి అభివృద్ధిపైన, ఆరు గ్యారంటీల అమలుపైన దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం భాషను చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని మండిపడ్డారు. కాళేశ్వరం డిజైన్‌‌ లోపానికి ప్రధాన బాధ్యత కేసీఆర్‌‌దేనని, ఆయనే ఇంజినీర్‌‌ అవతారం ఎత్తి, అనేక వేషాలు వేసి డిజైన్లు తయారు చేశారన్నారు. 

కేసీఆర్‌‌తో రేవంత్‌‌ రెడ్డి కుమ్మక్కు అయ్యారని, అందుకే కేసీఆర్‌‌ కుటుంబం సహా బీఆర్ఎస్‌‌ నేతల అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదని, వారిని అరెస్ట్‌‌ చేయడం లేదన్నారు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తే కేంద్రంపై నెపం వేసి తప్పించుకోవాలని చూస్తున్నారని, సీబీఐకి పంపిన లేఖలోనూ పూర్తి స్థాయిలో వాస్తవాలు చెప్పలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చని, కవిత పార్టీని సైతం స్వాగతిస్తామన్నారు. కానీ ప్రజల కోసం పనిచేసే పార్టీకే మనుగడ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. 

ఇండ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోండి

రాష్ట్రంలో వార్డు మెంబర్ మొదలు సర్పంచ్‌‌ దాకా, కౌన్సిలర్ మొదలు కార్పొరేటర్ దాకా ప్రతీ ఒక్క ప్రజాప్రతినిధి తమ ఇండ్లపై సోలార్‌‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. కోటి ఇండ్లపై సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేయడమే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు. ఇందుకోసం రూ.75 వేల కోట్లకుపైగా నిధులను కేటాయించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ సోలార్ వ్యవస్థపై పూర్తిస్తాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందన్నారు.