వారణాసి 'బనారసి పాన్','లాంగ్డా' మామిడిలకు జీఐ గుర్తింపు

వారణాసి 'బనారసి పాన్','లాంగ్డా' మామిడిలకు జీఐ గుర్తింపు

బనారస్ లో అత్యంత ప్రసిద్ధి పొందిన బనారసి పాన్, బనారసి లాంగ్డా రకానికి మామిడి పండ్లు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగింగ్ ను దక్కించుకున్నాయి. ఇవేకాదు ఉత్తరప్రదేశ్ కు చెందిన అలీఘర్ తాళాలు, బకీరా ఇత్తడి వస్తువులు, బంద షాజర్ రాతి కళాకృతులు, హత్రాస్ ఇంగువ, నగీన కలప కళాకృతులు, ప్రతాప్ ఘర్ ఉసిరికి జీఐ ట్యాగ్ అందింది. చందౌలీ జిల్లాకు చెందిన 'ఆదమ్చిని' రకానికి చెందిన బియ్యం సైతం జీఐ ధ్రువీకరణ పొందింది. మార్చి 31న చెన్నైలోని GI రిజిస్ట్రీ 33 ఉత్పత్తులకు GI ధృవీకరణను మంజూరు చేసింది. ఇందులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 10, వారణాసికి చెందిన మూడు రకాల ఉత్పత్తులున్నాయి. చేర్పుల తర్వాత తాజాగా ఉత్తరప్రదేశ్ నుండి మొత్తం GI ఉత్పత్తుల సంఖ్య 45 కి చేరుకోగా.. వాటిలో 20 వారణాసి ప్రాంతానికి చెందినవే ఉండడం గమనార్హం. ప్రస్తుతం GI రిజిస్ట్రీ 441 భారతీయ ఉత్పత్తులు, 34 విదేశీ వస్తువులకు GI ట్యాగ్‌లను మంజూరు చేసింది.

ఈ సంవత్సరం జీఐ సర్టిఫికేట్ పొందిన 33 వస్తువులలో 20 వస్తువులకు సుప్రసిద్ధ GI నిపుణుడు పద్మశ్రీ రజనీ కాంత్ సర్టిఫికేషన్‌ను అందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీకి, సంప్రదాయ GI వస్తువులను ప్రోత్సహించడంలో ఉత్సాహం చూపిన వారణాసి ఎంపీకి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా లోకల్ వస్తువులకు జీఐ ట్యాగ్ ఇవ్వడం ద్వారా అవి ప్రపంచంలోని నలుమూలలకు వెళ్తున్నాయని రజనీ కాంత్ అన్నారు. జీఐ ట్యాగ్ ద్వారా విశిష్ట ఉత్పత్తులకు గుర్తింపుతో పాటు రక్షణ కల్పించడంతో దేశం తన వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్తోందని చెప్పారు.

GI రిజిస్ట్రీ ప్రకారం, ఉత్తరప్రదేశ్ నుండి ఇటీవల ధృవీకరించబడిన వస్తువులలో అలీఘర్ తాలా, బఖారియా బ్రాస్‌వేర్, బండా షాజర్ పత్తర్ క్రాఫ్ట్, నగీనా వుడ్ క్రాఫ్ట్, ప్రతాప్‌గఢ్ అయోన్లా, హత్రాస్ హింగ్, రామ్‌నగర్ భంటా, ముజఫర్‌నగర్ గుర్ (బెల్లం), బనారస్ లాంగ్డా ఉన్నాయి. ఈ క్రమంలోనే వెయ్యి మంది రైతుల పేర్లను నమోదు చేయడంతో పాటు వారి ఉత్పత్తులకు కల్పించిన జీఐ ట్యాగింగ్ సర్టిఫికెట్లను నాబార్డ్ ఏజీఎం (NABARD AGM ) అనుజ్ కుమార్ సింగ్ అందించారు.

జీఐ ట్యాగ్ వల్ల కలిగే ప్రయోజనాలు

  • జీఐ ట్యాగ్ వల్ల ఆ వస్తువుకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. అంతే కాకుండా ఆ వస్తువును ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వారో కూడా తెలుస్తుంది. దాని వల్ల తయారీదారికి కూడా పేరు వస్తుంది.
  • జీఐ ట్యాగ్ వచ్చిన ప్రొడక్టును ఇంకెవ్వరూ కాపీ చేయడానికి వీలు లేదు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఏం చేయాలన్నా ఆ వస్తువుపై రిజిస్టర్ అయిన వ్యక్తికి మాత్రమే అధికారం ఉంటుంది. జీఐ ట్యాగ్ వచ్చిన వస్తువులకు ఈ విషయంలో చట్టబద్దమైన సాయం ఉంటుంది.
  • ఈ ట్యాగ్ వచ్చిన వస్తువులకు వాటి ఆకృతిలో గానీ, రుచిలో గానీ నాణ్యతలో గానీ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది.
  • తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు తిరుపతి లడ్డూకు, హైదరాబాద్ హలీమ్ కు 2010లో జీఐ ట్యాగ్ వచ్చింది. నిర్మల్ కొయ్యబొమ్మలకు 2009లో జీఐ ట్యాగ్ వచ్చింది.