
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ దిగ్గజాలపై ఆన్‌లైన్ వెండార్స్ అసోసియేషన్ దాఖలు చేసిన అప్పీలును ఎన్‌సీలాట్ అంగీకరించింది. ఆన్‌లైన్‌లో చక్రం తిప్పేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నాయనే తమ ఆరోపణలను సీసీఐ కొట్టివేయడంతో ఈ అప్పీలును ఆన్‌లైన్ వెండార్స్ అసోసియేషన్ దాఖలు చేసింది. దిగ్గజాల అక్రమ విధానాలతో తాము నష్టపోతున్నామని ఆన్‌లైన్ వెండార్ల అసోసియేషన్ చెబుతోంది. ఈ కారణంగానే ఎన్‌సీలాట్(నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్)లో కేసు వేస్తున్నట్లు వెల్లడించింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు వ్యతిరేకంగా ఆన్‌లైన్ వెండార్లు వేసిన పిటిషన్‌ను విచారించేందుకు ఎన్‌సీలాట్ ఒప్పుకుంది. సీసీఐకి వ్యతిరేకంగా అప్పీల్‌ను దాఖలు చేసేందుకు 12 రోజుల జాప్యాన్ని కూడా ఎన్‌సీలాట్ ఆమోదించింది. ‘వెండార్ల అప్పీల్‌ను విచారించడానికి ఒప్పుకుంటున్నాం. తదుపరి ఎలాంటి నోటీసులు జారీ చేయడానికి వీలు లేదు’ అని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్‌సీలాట్) పేర్కొంది. ముగ్గురు సభ్యులతో కూడిన ఎన్‌సీలాట్ బెంచ్‌కు ఎస్‌జే ముఖోపాధ్యాయ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. జూలై 30న ఈ అప్పీల్ ఎన్‌సీలాట్ విచారించనుంది. సీసీఐ జారీ చేసిన ఆదేశాలకు ఎన్‌సీలాట్ మే 2017 నుంచి అప్పీలెట్ అథారిటీగా ఉంటూ వస్తోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు పాటించే విధానాలు సరైనవేనని సీసీఐ గతంలో సమర్ధించింది. కాంపిటీషన్ చట్టంలోని నిబంధనలను పాటిస్తున్నాయని చెబుతూ 2018 నవంబర్ 6న సీసీఐ ఆర్డర్లను జారీ చేసింది. ఆల్ ఇండియా ఆన్‌లైన్ వెండార్స్ అసోసియేషన్ ఆరోపణలను సీసీఐ కొట్టిపారేసింది. ఫ్లిప్‌కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్ ఆధిపత్యం కోసం అక్రమ విధానాలను అనుసరిస్తోందని ఆన్‌లైన్ వెండార్లు ఆరోపించారు. ఫ్లిప్‌కార్ట్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ నుంచి మొబైల్స్, కంప్యూటర్లు, దానికి సంబంధించిన అన్ని రకాల వస్తువుల వరకు విక్రయిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో దొరకని వస్తువంటూ ఉండదు. కాంపిటీషన్ యాక్ట్‌లోని సెక్షన్ 4 ఎలాంటి ఉల్లంఘనకు గురికావడం లేదని సీసీఐ స్పష్టం చేసింది. ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ ప్లేస్ ఈ కామర్స్ వ్యాపారాలకు వర్తించే అన్ని రకాల నిబంధనలను పాటిస్తోందని గుర్తించినట్టు సీసీఐ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ చట్టాలకే కట్టుబడి ఉందని తన ఆర్డర్‌లో తెలిపింది. ఆన్‌లైన్ వెండార్స్ అసోసియేషన్ కింద 2 వేలకు పైగా అమ్మకం దారులు ఉన్నారు.