ఘనంగా 11వ రోజు సహస్రాబ్ది వేడుకలు 

ఘనంగా 11వ రోజు సహస్రాబ్ది వేడుకలు 

హైదరాబాద్ : ముచ్చింతల్లోని శ్రీరామ నగరంలో రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11వ రోజు వేడుకల్లో భాగంగా శనివారం అష్టాక్షరీ మహామంత్ర జపం, అనంతరం యాగశాలలో లక్ష్మీనారాయణ మహాయాగం జరుగుతోంది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చిన్నజీయర్  స్వామితో పాటు రుత్వికులు 114 యాగశాలల చుట్టూ ప్రదక్షిణ చేయనున్నారు. యాగశాలలో తీవ్ర వ్యాధుల నివారణకై పరమేష్టి, పితృదేవతా తృప్తి, విఘ్న నివారణ కోసం వైభవేష్ఠి హోమాలు నిర్వహిస్తున్నారు. ప్రవచన మండపంలో పరవాసుదేవ అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్ర నామ పారాయణం, కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. 

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇవాళ సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. సాయంత్ర 6గంటలకు ఆయన ముచ్చింతల్ చేరుకోనున్నారు. వెంకయ్య నాయుడుతో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా సమతామూర్తిని దర్శించుకోనున్నారు. అనంతరం విగ్రహంపై త్రీడీ మ్యాపింగ్ వీక్షించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ రోజు సాయంత్రం 5గంటలకు ముచ్చింతల్కు వెళ్లనున్నారు.