పూర్తిగా తగ్గిపోయిన విజయ డెయిరీ ప్రొడక్టులు

పూర్తిగా తగ్గిపోయిన విజయ డెయిరీ ప్రొడక్టులు

సికింద్రాబాద్, వెలుగు: ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ డిమాండ్​కు సరిపడా సప్లయ్ చేయలేకపోతోంది. 27 రకాలకు గాను మార్కెట్​లో విజయ డెయిరీ ప్రొడక్ట్​లు ఐదారుకు మించి కనిపించడం లేదు. పూర్తిస్థాయి మేనేజింగ్​డైరెక్టర్ లేకపోవడంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తయారీ, సరఫరా విషయంలో కోఆర్డినేషన్​లేకనే ఉత్పత్తి తగ్గిపోతుందని తెలుస్తోంది. ఒక్క పాలు మీద మాత్రమే ఫోకస్​పెడుతున్న అధికారులు మిగిలిన వాటిని పట్టుంచుకోవడం లేదు. దీనికితోడు విజయ డెయిరీ పాలు ఉదయం 8 గంటలు దాటితే విరిగిపోతున్నాయని వినియోగదారులు అంటున్నారు. సంబంధిత శాఖ మంత్రి, అధికారులేమో వినియోగదారులు, పాడి రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ డెయిరీని లాభాల బాటలో నడిపిస్తున్నామని చెబుతున్నారు. కానీ సిటీలోని 200 అవుట్​లెట్లకు ఉత్పత్తులను అందించడంలో డెయిరీ కొన్నాళ్లుగా ఫెయిల్​అవుతోంది. ఇలాగే ఉంటే క్రమంగా ప్రభుత్వ డెయిరీపై నమ్మకం పోతుందని వినియోగదారులు అంటున్నారు. ఏడాదిగా విజయ డెయిరీకి పూర్తిస్థాయి మేనేజింగ్​డైరెక్టర్ లేకపోవడమే అన్ని సమస్యలకు కారణమని తెలుస్తోంది. 

2 కిలోలు కూడా ఇవ్వలేని పరిస్థితి

తార్నాక డివిజన్ లాలాపేటలోని విజయ డెయిరీ 2018 వరకు తీవ్ర నష్టాలతో కొనసాగింది. వాటిని అధిగమించేందుకు అధికారులు ప్రైవేట్ డెయిరీలతో పోటీ పడిపాలతోపాటు దాదాపు 27 రకాల పాల ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చారు. వాటిని ప్రమోట్​ చేసేందుకు 200 అవులెట్లకు అనుమతి ఇచ్చారు. పెరుగు, నెయ్యి, మజ్జిగ, దూద్​పేడ, లడ్డూ, సోన్​పాపిడి ఇలా మొత్తం 27 రకాలను  డెయిరీ తయారుచేస్తోంది. దీంతో గతేడాది వరకు డెయిరీకి మంచి లాభాలు వచ్చాయి. కానీ కొద్దినెలలుగా అవుట్​లెట్లకు డెయిరీ నుంచి ఉత్పత్తులు పూర్తిగా తగ్గిపోయాయి. దాదాపు అన్నిచోట్ల పార్లర్లు ఖాళీగా ఉంటున్నాయని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు. ఏదైనా ఫంక్షన్లకు పాలు, పెరుగు, నెయ్యి కావాలని ఆర్డర్​ఇస్తే రెండు, మూడు గంటలు తర్వాత అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక స్వీట్ల విషయానికొస్తే 10 కిలోలు ఆర్డర్డ్​చేస్తే కనీసం 2 కిలోలు కూడా దొరకట్లేదని తెలుస్తోంది.

మెగా ప్యాకేజీ ఊసేది?

గతేడాది దాదాపు 25 రకాల కొత్త స్వీట్లను మార్కెట్​లోకి తెస్తామని చెప్పిన అధికారులు తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేశారు. గతేడాది దసరా ముందు దాదాపు 12 రకాల స్వీట్లతో మెగా ప్యాకేజీని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించి, ఒక్కో ప్యాకేజీ బాక్సు ధరను రూ.వెయ్యి నుంచి రూ.1200గా నిర్ణయించారు. ముందుగా వాటి రుచి చూసి నిర్ధారించాలని రాష్టంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులకు ఫ్రీగా డెయిరీ అధికారులు అందజేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మెగా ప్యాకేజీ మార్కెట్​లోకి రిలీజ్​కాలేదు. డెయిరీ తయారు చేసే డబ్బా నెయ్యికి మార్కెట్​లో ఎంతో డిమాండ్​ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడా డబ్బా నెయ్యి దొరకట్లేదు. ప్యాకెట్లు అందుబాటులో ఉంటున్నా వాటికి అంతగా డిమాండ్​లేదని అవుట్​లెట్ల నిర్వాహకులు అంటున్నారు. 

ఇండెంట్​ ప్రకారం సరఫరా చేస్తున్నం

డెయిరీలో అన్ని రకాలు తయారు చేస్తున్నాం. డెయిరీ పార్లర్ల నిర్వాహకులు ఇచ్చిన ఇండిడెంట్​కు ప్రకారం అందిస్తున్నాం. గతేడాది దసరా టైంలో అందుబాటులోకి తెచ్చిన స్పెషల్ గిఫ్ట్ ప్యాకేజీకి కరోనా కారణంగా ఆదరణ తగ్గడంతో విక్రయాలు ఆపేశాం. మిగతా రకాల విక్రయాలు తగ్గినా ప్రస్తుతం చాలా వరకు పుంజుకున్నాయి. డెయిరీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవుట్​లెట్లలో డిస్కౌంట్లు కొనసాగుతున్నాయి. 
- కామేష్​, విజయ డెయిరీ జనరల్​మేనేజర్​, లాలాపేట

నెయ్యి డబ్బా కోసం 3 నెలలుగా తిరుగుతున్నా

విజయ డెయిరీ తయారు చేసే డబ్బా నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు ఈ నెయ్యినే తింటారు. మూడు నెలలుగా డబ్బా దొరకడం లేదు. లాలాపేటలోని డెయిరీకి వెళ్లి అడిగాను. ఇండెంట్ లో పెట్టండని చెప్పినా అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికైనా స్పందించి అవసరమైన ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలి.

- రమాదేవి, తార్నాకడిస్కౌంట్లు తీసేశారు

సిటీలో 200 ప్రైవేట్​అవుట్​లెట్లు ఉండగా, కోఠి, లాలాపేటలో రెండు అవుట్​లెట్లు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ రెండింటిలోని ప్రొడక్ట్​లపై గతంలో 12 నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్​ఇచ్చేవారు. దీంతో వీటిలో విక్రయాలు ఎక్కువగా జరిగేవి. ఏడాదిగా కోఠిలోని అవుట్​లెట్ లో డిస్కౌంట్లను పూర్తిగా తీసేశారు. లాలాపేటలోని డెయిరీ వద్ద ఉన్న అవుట్​లెట్​లో కొన్నింటిపై మాత్రమే డిస్కౌంట్​ఇస్తున్నారు. దీంతో వీటిలోనూ చాలావరకు విక్రయాలు తగ్గాయి.