యాదగిరి గుట్టలో కిందనే వ్రతాలు

యాదగిరి గుట్టలో కిందనే వ్రతాలు

ఏర్పాట్లు చేస్తున్న ఆఫీసర్లు

కొండపై నిర్మాణ పనులతో నిర్ణయం

యాదగిరిగుట్ట, వెలుగు: వారం రోజుల్లో వ్రతాల నిర్వహణ యాదగిరి కొండ కిందికి షిఫ్ట్ చేస్తామని యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి సోమవారం మీడియాకు తెలిపారు. గుట్టమీద వ్రతశాల లేకపోవడంతో ఇప్పటిదాకా క్యూ కాంప్లెక్స్ కోసం నిర్మించిన భవనాన్ని ఉపయోగించారు. దాంతో క్యూలైన్ల ఏర్పాటు పనులు నిలిచిపోయాయి. సోమవారంతో కార్తీక మాసం ముగియడం, వ్రతాలకు భక్తుల రద్దీ తగ్గడంతో క్యూ కాంప్లెక్స్ భవనాన్ని ఖాళీ చేయాలని వైటీడీఏ అధికారులు ఆలయ ఆఫీసర్లను ఆదేశించారు. దీంతో అధికారులు ప్రత్యామ్నాయంగా కొండ కింద ఉన్న తులసీ కాటేజీ ప్రాంగణంలోని  మినీ శిల్పారామం కోసం తయారు చేసిన షెడ్డులో ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీకమాసం చివరి రోజు సోమవారం యాదాద్రిలో భక్తుల రద్దీ తగ్గింది. రోజువారీ పూజలు కొనసాగగా.. 226 మంది సత్యనారాయణస్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, యాంకర్ శ్యామల నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా సోమవారం ఆలయానికి ఆదాయం రూ.12,99,834 వచ్చింది.