అన్ని స్కూళ్లలో కనీస వసతులు కల్పించాలి : కలెక్టర్ భవేశ్ మిశ్రా

అన్ని స్కూళ్లలో కనీస వసతులు కల్పించాలి : కలెక్టర్ భవేశ్ మిశ్రా

భూపాలపల్లి అర్బన్, వెలుగు :  జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలని భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, మైనర్ మరమ్మతులు, మౌలిక సదుపాయాలు కల్పన తదితర అంశాలపై విద్య, పంచాయతీరాజ్, డీఆర్డీవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 13 పాఠశాలలో తాగునీటి సౌకర్యాలు లేనట్లు గుర్తించామని, 61 పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మించాల్సి ఉందన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మాణానికి 42 మరుగుదొడ్లు అనుమతులు మంజూరు చేశామని, నెల రోజుల్లో మొత్తం పూర్తిచేయాలని ఆదేశించారు. ఎన్ని పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందో చెప్పాలని డీఈవోను అడుగగా సమాధానం చెప్పక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  నిర్మించాల్సిన మరుగుదొడ్లపై నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో నరేశ్, డీఈవో రామ్ కుమార్, పీఆర్ ఈఈ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందచేసిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 15 దరఖాస్తులను ఆయన స్వీకరించారు. ఆయా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖలకు ఎండార్స్మెంట్ చేశారు.