- రేవంత్ రెడ్డిది కూల్చివేతల సర్కార్: రాంచందర్ రావు
- అక్కడి వేద పాఠశాల, గుడిని కూల్చాలనుకోవడం దుర్మార్గం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ దేవాలయాలు, మఠాలను లక్ష్యంగా చేసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శారదా పీఠం జోలికి వస్తే బీజేపీ ఊరుకోదని, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడుతామని హెచ్చరించారు. కోకాపేట నియోపొలిస్లోని విశాఖ శారదా పీఠానికి కేటాయించిన స్థలం, అక్కడి నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో.. శనివారం ఆయన పీఠాన్ని సందర్శించారు. అక్కడి వారితో మాట్లాడి, వివరాలు సేకరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సర్కారు ‘గడ్డపార’ సర్కారుగా మారిందని రాంచందర్ రావు ఎద్దేవా చేశారు. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చడమే కాకుండా.. ఇప్పుడు గుళ్లు, గోపురాల మీద పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 2019లో చట్టబద్ధంగా శారదా పీఠానికి రెండు ఎకరాలు కేటాయించిందని రాంచందర్ రావు గుర్తుచేశారు. అక్కడ రాజశ్యామల అమ్మవారి ఆలయం నిర్మితమై నిత్య పూజలు, అన్నదానం, వేద పాఠశాల కార్యకలాపాలు సాగుతున్నాయని తెలిపారు. భక్తి, సంప్రదాయాలతో ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న పవిత్ర కేంద్రంపై కూల్చివేత చర్యలకు ఉపక్రమించడం దారుణమన్నారు.
వెనక్కి తగ్గడం బీజేపీ విజయం
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల ఆందోళన, తన పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణ వచ్చిందని రాంచందర్ రావు తెలిపారు. పీఠం విషయంలో ఎలాంటి జోక్యం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రజల మనోభావాలు, గాఢ విశ్వాసాలను దెబ్బతీసే చర్యలకు ప్రభుత్వాలు దూరంగా ఉండాలని హితవు పలికారు.
