- వారిని వారి దేశాలకు తిప్పి పంపండి
- కేంద్ర మంత్రి సంజయ్‌కి గణేశ్ ఉత్సవ సమితి వినతి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని డిఫెన్స్ఏరియాల్లో రోహింగ్యాలు, బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు తిష్ట వేశారని, వారితో జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.రాఘవ రెడ్డి, రావినూతల శశిధర్ శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. సిటీలోని డీఆర్డీవో, డీఆర్డీఎల్, ఆర్ సీఐ వంటి కీలక రక్షణ సంస్థల చుట్టుపక్కల దాదాపు 26 కాలనీల్లో వీరు అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు.
దీనివల్ల గూఢచర్యం, అక్రమ కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. దేశంలోకి అక్రమంగా చొరబడ్డ వీరికి అధికారిక గుర్తింపు పత్రాలు ఎలా వచ్చాయో విచారణ జరపాలని, ఇందుకు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్, రక్షణ శాఖ భూముల్లో అక్రమంగా ఉంటున్నవారిని అరెస్ట్‌చేసి, వారి దేశాలకు తిప్పి పంపాలన్నారు.
