ఉద్యోగుల సంక్షేమమే సర్కారు ధ్యేయం : మంత్రి సీతక్క

ఉద్యోగుల సంక్షేమమే  సర్కారు ధ్యేయం : మంత్రి సీతక్క
  •     త్వరలో హెల్త్ కార్డులు జారీ చేస్తం: మంత్రి సీతక్క
  •     పంచాయతీ కార్యదర్శుల డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ 

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సర్కార్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటుందని తెలిపారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ సెంట్రల్ ఫోరం (టీపీఎస్​సీఎఫ్​) డైరీ, క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని మంత్రి సీతక్క ప్రశంసించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ త్వరలోనే హెల్త్ కార్డులు అందజేస్తామని ప్రకటించారు. 

వివాదాస్పద జీవో నెం.317 కారణంగా స్థానికత కోల్పోయి, దూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న 223 మంది పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేశామన్నారు. వీరికి రెండేండ్ల పాటు అంతర్ జిల్లా డిప్యూటేషన్‌‌‌‌పై నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో తొలగించిన పంచాయతీ కార్యదర్శులను తిరిగి విధుల్లోకి తీసుకున్నామన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు ఉద్యోగులు వారధిగా పనిచేయాలని సూచించారు. 

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, టీఎన్జీవో నేతలు, పంచాయతీ సెక్రటరీస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సందిల బలరాం కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో జనరల్ సెక్రటరీ ఎస్ఎం.హుస్సేని ముజీబ్, టీపీఎస్‌‌‌‌సీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణ, అసోసియేట్ ప్రెసిడెంట్ రఫీ, ఉపాధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, రమాదేవి, జాయింట్ సెక్రటరీ బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.