- ఎడిట్ ఆప్షన్‌తో 35 మండలాల్లో ప్రభుత్వ ఖజానాకు చిల్లు
- దీనిపై సిట్ వేయాలని డిమాండ్
జనగామ/వరంగల్, వెలుగు: ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి కాస్తా ‘భూ హారతి’గా మారిపోయిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. భూ భారతి పోర్టల్ తెచ్చిన తర్వాత కోటి ఎకరాల భూమిని 22ఏలో చేర్చారని, కమీషన్లు తీసుకొని అందులోంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
శనివారం జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌తో భూ భారతి పోర్టల్ రూపొందించామని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి గొప్పలు చెప్పారన్నారు. ఆ పోర్టల్ ఎడిట్ ఆప్షన్‌తో ప్రభుత్వ ఖజానాకు కన్నం పెడితే.. రైతులకు ఎలా నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని 35 మండలాల్లో జరిగిన ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి అయిన బస్వరాజుకు ఎడిట్ ఆప్షన్, కోడ్ ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. దీని వెనుక కాంగ్రెస్ లీడర్లు, ఉన్నతాధికారుల హస్తం ఉందని, అందుకే 48 మందిపై కేసులు నమోదు అయితే 15 మందిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. ఈ స్కామ్‌లో ఎవరెవరు ఉన్నారో ? ఎంతెంత చేతులు మారిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే బయటపెడ్తామన్నారు.
ఈ స్కామ్ విచారణకు వెంటనే సిట్ వేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతానని చెప్పారు. ఎన్నికలు రాగానే సీఎం రేవంత్‌కు రైతుబంధు గుర్తుకొస్తుందన్నారు. రూ. వంద కోట్లతో క్యాంప్ ఆఫీస్, అందాల పోటీలు, ఫుల్ బాల్ మ్యాచ్ నిర్వహించడంతోపాటు గాంధీ విగ్రహం పేరుతో రూ. కోట్లు ఖర్చు చేస్తున్న సీఎం.. రైతులకు అనగానే డబ్బులు లేవంటున్నారని వివర్శించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను ఏపీ దోచుకెళ్తుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
అది వ్యాగన్ ఫ్యాక్టరీనా? లేదా కోచ్ ఫ్యాక్టరీనా?
కాజీపేటలో పెడుతున్నది వ్యాగన్ ఫ్యాక్టరీనా? లేదంటే కోచ్ ఫ్యాక్టరీనా? అనే విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. దీనిపై కనీసం గెజిట్ నోటిఫికేషన్ కూడా రాలేదని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‍భాస్కర్ ఆధ్వర్యంలో ‘కొలువుల కొట్లాట’ పేరుతో శనివారం కాజీపేట చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో హరీశ్‌రావు మాట్లాడారు.
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి మోసం చేయడంతో ఆర్థిక ఇబ్బందులతో 200 మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‍రెడ్డి పాల్గొన్నారు.
