- అపరిమిత ఏఐ టూల్స్ వాడకానికి అమెరికా మిలిటరీ డిమాండ్
- ఒప్పుకోని ఆంత్రోపిక్.. ట్రంప్ ఫైర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్ ఆంత్రోపిక్ టెక్నాలజీని వాడొద్దని ఫెడరల్ ఏజెన్సీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. ఆ టెక్నాలజీ వాడకాన్ని వెంటనే ఆపివేయాలని తన ట్రూత్
సోషల్లో ఆయన పేర్కొన్నారు.
వాషింగ్టన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్ ఆంత్రోపిక్ టెక్నాలజీని వాడరాదని ఫెడరల్ ఏజెన్సీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఆ టెక్నాలజీ వాడుకను వెంటనే ఆపివేయాలని తన ట్రూత్ సోషల్ లో ఆయన పేర్కొన్నారు. ‘‘మాకు ఆంత్రోపిక్ అవసరం లేదు. మేము ఆ టెక్నాలజీని కోరుకోవడం లేదు. వారితో ఇక ఏమాత్రం కార్యకలాపాలు చేయం” అని ట్రంప్ తెలిపారు.
ఆంత్రోపిక్ ఏఐ టూల్స్ ను అపరిమితంగా వాడుకోవడానికి అమెరికా మిలిటరీకి అమనుతి ఇవ్వాలని వైట్ హౌస్ అంతకుముందు చేసిన డిమాండ్ ను సదరు కంపెనీ తిరస్కరించింది. దీంతో ఆ కంపెనీకి, యూఎస్ ప్రభుత్వానికి మధ్య తీవ్రంగా విభేదాలు తలెత్తాయి. ఆంత్రోపిక్ సప్లై చైన్ రిస్క్ లో ఉందని యూఎస్ డిఫెన్స్ మంత్రి పీట్ హెగ్ సేత్ అన్నారు.
మంత్రి వ్యాఖ్యనించినట్లు తాము సప్లై చైన్ రిస్క్ లో లేమని, ఆయన వ్యాఖ్యలను కోర్టులో సవాలు చేస్తామని ఆంత్రోపిక్ తెలిపింది. సప్లై చైన్ రిస్క్ లో ఉన్నట్లు వ్యాఖ్యానించడం చట్టపరంగా కరెక్టు కాదని పేర్కొంది. అలా వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే ఏ అమెరికన్ కంపెనీకైనా ప్రమాదకరమని అభిప్రాయపడింది. తన ఏఐ టూల్స్ ను అమెరికా ప్రభుత్వం విస్తృతంగా వాడుకుంటోందని, ఇది తమపై నిఘా పెట్టడమే అని కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది.
టెక్నాలజీ విస్తృత వాడకం కోసం తమను బెదిరించలేరని, ఒత్తిడి చేయలేరని స్పష్టం చేసింది. కాగా.. తన టెక్నాలజీ, టూల్స్ ను ఎలాంటి చట్టబద్ధమైన ఉపయోగానికైనా వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆంత్రోపిక్ ను యూఎస్ సర్కారు ఒత్తిడి చేసింది. దీంతో ప్రభుత్వ విజ్ఞప్తిని ఆ కంపెనీ తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఆంత్రోపిక్ టెక్నాలజీకి సంబంధించిన ఏఐ టూల్స్ ను వాడకూడదని ఫెడరల్ ఏజెన్సీని ట్రంప్ ఆదేశించారు.
