ఏడో బ్లాక్ కొత్తగా కట్టాల్సిందే.. మేడిగడ్డ పై మరోసారి తేల్చి చెప్పిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ

ఏడో బ్లాక్ కొత్తగా కట్టాల్సిందే.. మేడిగడ్డ పై మరోసారి తేల్చి చెప్పిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ
  • జరిగింది చాలా పెద్ద డ్యామేజ్.. రిపేర్లు చేసినా లాభం లేదని వెల్లడి
  • కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్లపై ఢిల్లీలో టెక్నికల్ ఓవర్ సైట్ కమిటీ మీటింగ్ 
  • ప్రాథమిక డిజైన్ల పరిశీలన.. 15 రోజుల్లో తుది డిజైన్లు ఇవ్వాలని సూచన
  • కట్ ఆఫ్ వాల్, సిల్టింగ్​ బేసిన్ ఎక్స్ టెన్షన్​పై చర్చ

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్​లో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ ను పూర్తిగా తొలగించి కొత్తగా కట్టాల్సిందేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) మరోసారి తేల్చిచెప్పింది. ఏడో బ్లాక్ డ్యామేజ్ చాలా పెద్దదని, దానికి రిపేర్లు చేసి వదిలేస్తే నిలవదని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్​బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల రిపేర్లపై బుధవారం ఎన్డీఎస్ఏ టెక్నికల్ ఓవర్ సైట్ కమిటీ మీటింగ్ నిర్వహించారు.

బ్యారేజీల ప్రాథమిక డిజైన్లను అధికారులు కమిటీకి అందజేశారు. కట్ ఆఫ్ వాల్స్, స్టిల్లింగ్ బేసిన్ ఎక్స్ టెన్షన్ కు సంబంధించి డిజైన్లు ఇచ్చినట్టు తెలిసింది. ప్రాథమిక డిజైన్లపై సంతృప్తి వ్యక్తం చేసిన కమిటీ.. పలు మార్పులు సూచించినట్లు సమాచారం. 15 రోజుల్లో తుది డిజైన్లు సిద్ధం చేసి తీసుకురావాలని చెప్పింది.

రిపోర్టులన్నీ కమిటీకి అందజేత 
బ్యారేజీల వద్ద అన్ని టెస్టులు పూర్తయ్యాయి. దీంతో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ తో గ్రౌండ్ పెనిట్రేటింగ్ టెస్టుల రిపోర్టులను ఓవర్ సైట్ కమిటీకి అధికారులు అందించారు. 2డీ, 3డీ మోడల్ స్టడీస్ నివేదికలనూ ఇచ్చారు. ఆ రిపోర్టులను పరిశీలించిన కమిటీ.. మేడిగడ్డ బ్యారేజీలో ముఖ్యంగా ఏడో బ్లాక్ లో తీవ్రమైన సమస్యలు ఉన్నాయని చెప్పినట్టు తెలిసింది.

కటాఫ్ వాల్స్ కింద జరిగిన డ్యామేజీ వల్ల ఏడో బ్లాక్ కు రిపేర్లు సాధ్యం కాదని, చేసినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేసినట్టు చెప్తున్నారు. కాగా, డిజైన్లు, టెస్టుల రిపోర్టులపై టన్నెల్ సెక్రటరీ పరీక్షిత్ మెహ్రా ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో ఈఎన్సీ జనరల్ రమేశ్​బాబు, జాయింట్ సెక్రటరీ కె.శ్రీనివాస్, రామగుండం సీఈ శ్రీనివాస్ రావు గుప్తా, సీడీవో సీఈ తదితరులు పాల్గొన్నారు.