- కంప్లయింట్ చేస్కోవాలన్న రెస్టారెంట్ ఓనర్
- సెటిల్మెంట్ అన్నఫుడ్సేఫ్టీ ఆఫీసర్
మాదాపూర్, వెలుగు : రెస్టారెంట్‌కు వెళ్లి టేస్టీ ఫుడ్ఎంజాయ్ చేద్దామనుకుంటే అందులో పుచ్చిపోయిన పన్ను బోనస్‌గా వచ్చింది. ఇది చూసిన వినియోగదారుడు విస్తుపోయాడు. కాసేపటికి తేరుకుని ‘ఏంటిది’ అని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే ‘ఏం చేస్కుంటావో చేస్కో పో’ అని రిప్లై ఇచ్చాడు. యాక్షన్ తీసుకుంటారన్న ఆశతో ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌కు కాల్చేస్తే సెటిల్చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడు.
మాదాపూర్‌లోని ‘ది జాయింట్ అల్మంది’ రెస్టారెంట్లో శ్యామ్ప్రసాద్అనే స్టూడెంట్ బుధవారం మటన్ మండి కోసం వెళ్లాడు. ఫుడ్ తింటుండగా...పంటి కింద ఏదో గట్టిగా అడ్డం పడ్డట్టు అనిపించింది. బయటకు తీసి కనిపించినదాన్ని చూసి కంగారు పడ్డాడు. ఇంత సేపు తన పంటి కింద నమిలింది మరో పన్నా అనుకుని కోపంతో రెస్టారెంట్ ఓనర్‌ను పిలిచి గట్టిగా ప్రశ్నించాడు.
అతడు కూడా అంతే గట్టిగా ‘అది మాది కాదు..ఎక్కడైనా ఫిర్యాదు చేసుకో పో ’ అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ఓ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌కు ఫోన్‌చేస్తే తనిఖీ చేయకుండానే..‘వచ్చింది పన్నే కదా..ఏదో ఒకటి మాట్లాడుకుని సెటిల్ చేసుకో’ అని ఆఫర్ ఇచ్చాడని బాధితుడు వాపోయాడు. అయినా పట్టువదలకుండా పదే పదే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కు పోన్ చేయడంతో మరో ఆఫీసర్ తనిఖీలకు వచ్చారు. కిచెన్ తో పాటు ఫ్రిజ్ లో నిల్వ చేసిన మాంసాన్ని చెక్‌చేసి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
