- దసరా తర్వాత 2 లక్షల మందితో ర్యాలీ: మహేశ్ గౌడ్
- ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై 23న సీఎంతో భేటీ కానున్నట్లు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: దసరా తర్వాత హైదరాబాద్ లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చెప్పారు. బుధవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. సర్ ప్రక్రియ రద్దు, సీఈవో జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో రాష్ట్రాల్లో కూడా ఆందోళన నిర్వహించాలని హైకమాండ్ నిర్ణయించింద తెలిపారు. దక్షిణాదిలో రెండు సభలు పెట్టాలని రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆదేశించారని వెల్లడించారు.
2029 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మహేశ్ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడ్డవారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే కార్పొరేషన్ పదవుల నియామకంలో ఆలస్యమవుతున్నదని పీసీసీ చీఫ్ చెప్పారు. ఆర్టీసీ ఎన్నికల్లో తమ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని..సంస్థ బలోపేతం, కార్మికుల సంక్షేమమే తమ లక్ష్యమన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లలో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ నెల 23 న ఎంసీహెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నట్టు చెప్పారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారని తెలిపారు. రామగుండంలో బీఆర్ఎస్ నిర్వహించిన సింగరేణి గర్జనకు అర్థం లేదని, తమ ప్రభుత్వమే సింగరేణి కార్మికులకు తగిన ఫలాలను ఇస్తుందని చెప్పారు.
