నిరసన వేదికలను మారిస్తే ప్రశ్నలు చచ్చిపోతాయా ? తెలంగాణలో ఇదే అనుభవం

నిరసన వేదికలను మారిస్తే  ప్రశ్నలు చచ్చిపోతాయా ? తెలంగాణలో ఇదే అనుభవం

ప్రజాస్వామ్యంలో నిరసనల వల్ల అసౌకర్యం కలగవచ్చు.  ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన మొదలైతే  ప్రజలకు కూడా ఇబ్బంది కలగవచ్చు. నినాదాలతో పరిసరాలు మారుమోగవచ్చు. ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ నిలిచిపోవచ్చు. ఈ సమస్యలన్నీ వాస్తవమే. వాటిని కొట్టిపారేయలేం. కానీ ఇక్కడే ఒక ప్రశ్న మొదలవుతుంది. ప్రజాస్వామ్యంలో అసౌకర్యాన్ని నియంత్రించాలా?  అసమ్మతిని నియంత్రించాలా? ఢిల్లీలోని జంతర్‌‌‌‌‌‌‌‌ మంతర్‌‌‌‌‌‌‌‌ విషయంలో ఇప్పుడు ఈ ప్రశ్న మరోసారి ముందుకొచ్చింది.

అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 12, 2026న ఢిల్లీ పోలీసులు జంతర్‌‌‌‌‌‌‌‌ మంతర్‌‌‌‌‌‌‌‌ను నిరసనలకు అనుమతించిన ప్రాంతాల జాబితా నుంచి తొలగించారు.  రామ్‌‌‌‌‌‌‌‌లీలా మైదాన్‌‌‌‌‌‌‌‌,  బురారీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌, తూర్పు ఢిల్లీలోని  సీబీడీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లను ప్రత్యామ్నాయ  ప్రదేశాలుగా ప్రకటించారు. ఈ నిర్ణయానికి కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసులను కారణంగా చూపించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది జంతర్‌‌‌‌ మంతర్‌‌‌‌ను జాబితా నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసం?

ఒక నిర్దిష్ట  నిరసనకు అనుమతి నిరాకరించడం ఒక విషయం. దశాబ్దాలుగా నిరసనలకు గుర్తింపుపొందిన ప్రదేశాన్నే నిరసనల వేదికగా తొలగించడం మరో విషయం. మొదటిది ఒక కార్యక్రమానికి సంబంధించిన నిర్ణయం. రెండోది ప్రజలు తమ గొంతును ఎక్కడ వినిపించాలనే ప్రశ్నకు సంబంధించిన నిర్ణయం. జంతర్‌‌‌‌‌‌‌‌ మంతర్‌‌‌‌‌‌‌‌ అనేది ఢిల్లీలోని ఒక రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలం మాత్రమే కాదు. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వానికి తమ అభ్యంతరాలు చెప్పడానికి ఎంచుకున్న ఒక ప్రజాస్వామిక వేదిక.

పార్లమెంటు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న రాజధానిలో ప్రజల గొంతు వినిపించే ప్రదేశానికి ఒక రాజకీయ ప్రతీకాత్మకత కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ వేదికను తొలగించి ప్రత్యామ్నాయ ప్రదేశాలను చూపిస్తున్నారు. అయితే నిరసనను అనుమతిస్తున్నామని చెప్పడం మాత్రమే సరిపోదు. ఆ నిరసనకు అర్థం ఉండే ప్రదేశంలో, ఆచరణ సాధ్యమైన పరిస్థితుల్లో అనుమతిస్తున్నామా అన్నదే కీలకం.

తెలంగాణలో ఇదే అనుభవం
ఢిల్లీకి ఇది కొత్త అనుభవం కావచ్చు. కానీ తెలంగాణకు మాత్రం ఈ పరిణామంలో గతం కనిపిస్తుంది. 2017 మార్చిలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఇందిరాపార్క్‌‌‌‌‌‌‌‌ సమీపంలోని ధర్నాచౌక్‌‌‌‌‌‌‌‌ను నగర శివార్లకు తరలించాలనే అప్పటి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద వివాదానికి దారితీసింది. ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ సమస్యలు, స్థానికులకు ఇబ్బందులు, శబ్ద కాలుష్యం వంటి కారణాలను అధికారులు ప్రస్తావించారు. 

ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు మాత్రం ఇది తమ నిరసన హక్కును బలహీనపరిచే చర్య అని విమర్శించాయి. ధర్నాచౌక్‌‌‌‌‌‌‌‌ 1997 నుంచి అనేక రాజకీయ, సామాజిక ఆందోళనలకు వేదికగా ఉంది. 2005 నుంచి అది అధికారిక స్థలంగా కూడా మారింది.

ఆ స్థలాన్ని మార్చడం కేవలం ఒక ప్రాంతాన్ని మార్చడం కాదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు వినిపించే అవకాశాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఉద్యమకారులు వాదించారు. ఆ వివాదంలో ఒక కీలకమైన అంశం ఉంది. ధర్నా చౌక్‌‌‌‌‌‌‌‌ నగరం మధ్యలో ఉండటం వల్లే దానికి ప్రాధాన్యం వచ్చింది. ఒక నిరసనను భౌతికంగా కొనసాగించడానికి స్థలం ఉండటం ఒక విషయం. ఆ నిరసన ప్రజాస్వామికంగా ప్రభావం చూపడానికి అవసరమైన వాతావరణం ఉండటం మరో విషయం.

ముంబై, బెంగళూరుల్లోనూ ఇదే చర్చ
ఇది తెలంగాణకో, ఢిల్లీకో మాత్రమే పరిమితమైన సమస్య కాదు. దేశంలోని ఇతర నగరాల్లోనూ నిరసనల ప్రదేశం, ప్రజా సౌకర్యం, ప్రభుత్వ నియంత్రణ మధ్య ఇదే సంఘర్షణ కనిపిస్తోంది. ముంబైలోని ఆజాద్‌‌‌‌‌‌‌‌ మైదాన్‌‌‌‌‌‌‌‌ నిరసనలకు గుర్తింపు పొందిన వేదిక. 1997లో దక్షిణ ముంబైలో నిరసనలు, ర్యాలీల వల్ల శబ్ద కాలుష్యం, రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత నిరసనలను ఆజాద్‌‌‌‌‌‌‌‌ మైదాన్‌‌‌‌‌‌‌‌ వంటి నిర్దేశిత ప్రాంతంలో నిర్వహించే విధానం బలపడింది. 2025లో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నియమాల ప్రకారం నిరసనలకు ముందస్తు పోలీసు అనుమతి, నిర్దిష్ట సమయాలు, జనసమూహ పరిమితి వంటి షరతులు విధించారు.

బెంగళూరులోనూ నిరసనలను ఫ్రీడమ్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌కు పరిమితం చేసే విధానం అమల్లో ఉంది. ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ సమస్యలు, ప్రజా రాకపోకలు, ప్రభుత్వ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చూడాలనే కారణాలతో అక్కడి హైకోర్టు, పోలీసు వ్యవస్థ నిరసనల నిర్వహణపై పరిమితులు విధించాయి. అయితే నిరసనను నియంత్రించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ, చివరికి నిరసనను ప్రజల కళ్లకు కనిపించకుండా చేసే వ్యవస్థగా మారుతోందా?

నిరసన హక్కుపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
భారత రాజ్యాంగంలోని 19(1)(a) అధికరణం భావప్రకటన స్వేచ్ఛను, 19(1)(b) అధికరణం శాంతియుతంగా, ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే హక్కును కల్పిస్తున్నాయి. అయితే ఈ హక్కులు అపరిమితమైనవి కావు.  ప్రజాశాంతి, భద్రత వంటి రాజ్యాంగబద్ధ కారణాలతో సహేతుకమైన ఆంక్షలు విధించవచ్చు. ఇక్కడ కీలకమైనది ఆంక్ష విధించే అధికారం ఉందా లేదా అన్నది మాత్రమే కాదు. ఆ ఆంక్ష అవసరమైనదా, సముచితమైనదా,  దాని పరిధి ఎంత అన్నది కూడా. 2018లో మజ్దూర్‌‌‌‌‌‌‌‌ కిసాన్‌‌‌‌‌‌‌‌ శక్తి సంఘటన్‌‌‌‌‌‌‌‌ వర్సెస్‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు జంతర్‌‌‌‌‌‌‌‌ మంతర్‌‌‌‌‌‌‌‌ వద్ద నిరసనల నిర్వహణను పరిశీలించింది. శాంతియుత నిరసనలకు నియంత్రిత అనుమతి ఇవ్వడానికి తగిన విధానం రూపొందించాలని పేర్కొంది.

నిరసనకారులకూ హక్కు ఉందని చెప్పడం మాత్రమే కాకుండా, స్థానికులకు ఇబ్బందులు కలగకుండా దాన్ని ఎలా అమలు చేయాలన్న దానిపై కూడా దృష్టి పెట్టింది. 2020లో అమిత్‌‌‌‌‌‌‌‌ సహ్ని వర్సెస్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ కేసులోనూ సుప్రీంకోర్టు బహిరంగ ప్రదేశాలను నిరవధికంగా ఆక్రమించి ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించడాన్ని సమర్థించలేదు. అదే సమయంలో, నిరసనలకు సంబంధించిన అభ్యర్థనలను పరిశీలించకుండా సాధారణ నిషేధాలు విధించడం కూడా సమస్యాత్మకమని గత తీర్పులను ప్రస్తావించింది. అంటే న్యాయస్థానాల దృష్టిలో కూడా ఇది రెండు హక్కుల మధ్య సమతుల్యత సాధించాల్సిన అంశం.

ప్రత్యామ్నాయ స్థలం అంటే ?
ఢిల్లీలో జంతర్‌‌‌‌‌‌‌‌ మంతర్‌‌‌‌‌‌‌‌కు బదులుగా మూడు ప్రదేశాలను గుర్తించారు. జంతర్‌‌‌‌‌‌‌‌ మంతర్‌‌‌‌‌‌‌‌ నుంచి రామ్‌‌‌‌‌‌‌‌లీలా మైదాన్‌‌‌‌‌‌‌‌ సుమారు మూడు కిలోమీటర్లు, సీబీడీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ సుమారు 13.5 కిలోమీటర్లు, బురారీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ సుమారు 20 కిలోమీటర్లకుపైగా దూరంలో  ఉన్నాయి. ఈ దూరాలే  నిర్ణయం తప్పని నిరూపించవు. కానీ కొత్త ప్రదేశాలు నిరసనకు వచ్చే వృద్ధులు, మహిళలు, కార్మికులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవి ఎంత అనుకూలంగా ఉంటాయి అనే ప్రశ్నలను తప్పనిసరిగా లేవనెత్తుతాయి.

ప్రతి నిరసనను నగర శివార్లకు పంపించి, ప్రభుత్వ కార్యా లయాల చుట్టూ మాత్రం ప్రశాంతతను కాపాడితే, ఆ ప్రశాంతత ఎవరి కోసం? పాలనకు అంతరాయం కలగకూడదనే కారణంతో  ప్రశ్నించే గొంతు ప్రభావం తగ్గిపోతే, అది ప్రజా సౌకర్యం పేరుతో ఏర్పడే మరో రకమైన అణచివేత కాదా? అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలమైన నిరసనకైనా, దానికి వ్యతిరేకమైన నిరసనకైనా ఒకే ప్రమాణం వర్తించాలి. నిరసనకారుల రాజకీయ గుర్తింపును బట్టి అనుమతులు మారితే, చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రం దెబ్బతింటుంది.

పరిష్కారం నిషేధంలో కాదు, సమర్థమైన నిర్వహణలో ఉంది
నిరసనల వల్ల ఇబ్బందులు కలగకూడదని కోరుకోవడం తప్పు కాదు. కానీ నిరసనలే లేకపోతే ఇబ్బందులు ఉండవనే ఆలోచన ప్రమాదకరం. సమాజంలో అసంతృప్తి ఉన్నంతకాలం నిరసనలు ఉంటాయి. ఉద్యోగాలు లేవని యువత ప్రశ్నిస్తుంది. ధరలు పెరిగాయని ప్రజలు ఆందోళన చెందుతారు. రైతులు తమ సమస్యలు చెబుతారు. మహిళలు న్యాయం కోరతారు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే రాజకీయ పార్టీలు రోడ్ల మీదకు వస్తాయి. వీటన్నింటినీ ఒకే విధంగా చూడలేం. ప్రతి నిరసన స్వభావం, పరిమాణం, సందర్భం వేరు. అందుకే వాటిని నిర్వహించే విధానమూ బాధ్యతాయుతంగా, సందర్భానుసారంగా ఉండాలి.

ప్రభుత్వాలు చేయాల్సింది నిరసనకారులకు పరిమితులు విధించడం మాత్రమే కాదు. అనుమతుల ప్రక్రియను పారదర్శకంగా చేయాలి. నిరాకరణకు స్పష్టమైన కారణాలు చెప్పాలి. అవసరమైతే ఆ నిర్ణయాలను సమీక్షించే అవకాశం కల్పించాలి. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది పాలకులకు వ్యతిరేకంగా చేసే ఒక కార్యక్రమం మాత్రమే కాదు. పాలనకు ప్రజలు ఇచ్చే హెచ్చరిక కూడా.  ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కాపాడుతూనే ప్రజా జీవనానికి అంతరాయం తగ్గించడం అసాధ్యమైన పని కాదు. దానికి కావాల్సింది సమర్థమైన ప్రణాళిక, పారదర్శకమైన నియమాలు, నిష్పక్షపాతమైన అమలు. నిరసనకారులకూ బాధ్యత ఉండాలి.  ప్రభుత్వానికి, అధికారులకూ జవాబుదారీతనం ఉండాలి.

కంభాలపల్లి కృష్ణ, సీనియర్ జర్నలిస్ట్

  • ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ [email protected]
  • రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.