- ఉద్యోగులుగా కాదు, యజమానులుగా ఎదగాలన్న సీఎం రేవంత్ రెడ్డి
- హైదరాబాద్‌కు పోటీ సింగపూర్, న్యూయార్క్, టోక్యోలే
- 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
- హైటెక్ సిటీలో సమైక్య ఛాంబర్ గ్లోబల్ బిజినెస్ సదస్సు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: యువత బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగులుగా మిగిలిపోకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. భాగ్యనగరానికి చెన్నై, బెంగళూరు, ముంబై లేదా అమరావతి నగరాలు ఏమాత్రం పోటీ కావని.. న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి ప్రపంచ నగరాలతోనే మన పోటీ అని పేర్కొన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దిగ్గజం ఎలాన్ మస్క్‌తోనే నేరుగా పోటీపడుతూ రాకెట్లను ప్రయోగిస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ మన తెలుగు బిడ్డలేనని గుర్తుచేశారు.
హైటెక్ సిటీ వేదికగా మూడు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సమైక్య ఛాంబర్ ఆఫ్ కామర్స్’ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దిగ్గజాలు సత్య నాదెళ్ల, అజయ్ బంగా, శాంతను నారాయణ్ కేవలం ఉన్నతోద్యోగులుగా సేవలందిస్తున్నారన్నారు. మనం ఎప్పటికీ ఇతరుల కంపెనీలకు ఉద్యోగులుగానే కాకుండా సొంత పరిశ్రమలకు ఓనర్లుగా ఎదగాలని యువతకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలో నిర్మించే ఆర్ఆర్ఆర్ తెలంగాణకు గేమ్ ఛేంజర్‌గా మారబోతోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు రాయితీలు, అనుమతులు త్వరితగతిన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.
కాపు పోరాట పటిమను భావితరాలకు అందించాలి
సమాజానికి దిశానిర్దేశం చేసిన కాపు సామాజిక వర్గ ప్రముఖుల పోరాట పటిమను భావితరాలకు స్ఫూర్తిగా అందించే బాధ్యత సమైక్యపై ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. రాజకీయాల్లో వి.హనుమంతరావు, పి.శివశంకర్, డి.శ్రీనివాస్, కేకే, బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, డాక్టర్ కె.లక్ష్మణ్, బండి సంజయ్,.సినీ రంగంలో దాసరి నారాయణరావు, చిరంజీవి, పవన్ కల్యాణ్.. పరిపాలనలో ఎస్వీ ప్రసాద్, భాస్కరరావు, న్యాయవ్యవస్థలో జస్టిస్ భవానీ ప్రసాద్ రాణించారని పేర్కొన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు వ్యాపార, విద్యా, వైద్య రంగాల్లో వైదేహి మెడికల్ కాలేజీ వంటి మహోన్నత సంస్థలను నెలకొల్పి చిరస్మరణీయులయ్యారన్నారు.
గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్
హైదరాబాద్ 400 ఏండ్లుగా విభిన్న సంస్కృతులను ఆదరిస్తున్న అంతర్జాతీయ కాస్మోపాలిటన్ సిటీ అని సీఎం గుర్తుచేశారు. పాతబస్తీలోని చార్మినార్ ప్రాంతానికి వెళ్తే గుజరాతీలు, రాజస్తానీలు, పంజాబీలు, బెంగాలీలు, బిహారీలతో పాటు ఇరానీ, అఫ్గాన్ వ్యాపారస్తులు సైతం కనువిందు చేస్తారన్నారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్ వంటి ఆధునిక మౌలిక వసతులు నగర అభివృద్ధికి కొండంత అండగా నిలిచాయన్నారు. ప్రతిష్టాత్మక ఐఎస్బీ, ఐఐటీ హైదరాబాద్, నల్సార్ వంటి అంతర్జాతీయ విద్యా సంస్థలు ఇక్కడ కొలువుదీరడం వల్లే నగరం గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా ఎదిగిందని ప్రస్తావించారు.
జీడీపీకి తెలంగాణ వాటా 5%
దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.5 శాతమే అయినప్పటికీ, ప్రస్తుతం దేశ జీడీపీకి రాష్ట్రం 5 % సంపదను సమకూరుస్తూ ఆదర్శంగా నిలుస్తోందని సీఎం రేవంత్ గుర్తుచేశారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచి, 30 ట్రిలియన్ డాలర్ల దేశీయ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్రం నుంచి 3 ట్రిలియన్ డాలర్లు అందించడమే లక్ష్యమన్నారు. ఇందుకోసం వచ్చే ఏడాది డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నామని ప్రకటించారు. తమ ప్రభుత్వంలో పాలసీ పెరాలసిస్ లేదని, పరిశ్రమలకు ఉపయోగపడే పాత విధానాలను గౌరవిస్తూనే పెట్టుబడిదారులకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.
శ్రామికశక్తిగా మహిళలు
స్వయం సహాయక సంఘాల 67 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు గత మూడేండ్లలో రూ.61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ అందించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలకు 1,000 ఆర్టీసీ బస్సుల యాజమాన్యం, 1,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి, పెట్రోల్ బంకుల ఏర్పాటు, ఇందిరా మహిళా శక్తి నైట్ బజార్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ‘తెలంగాణ ఎదుగుతోంది.. మీరూ ఈ ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములు కండి’ అంటూ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
