న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి పండుగల వేళ 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్ చెల్లించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూ. 2,009.61 కోట్ల నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 11,40,770 మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
రైల్వే పనితీరును మెరుగు పరిచేలా ఉద్యోగుల్ని ప్రోత్సహించేందుకు ఈ బోనస్ చెల్లింపు దోహదం చేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన ఒక్కో రైల్వే ఉద్యోగికీ 78 రోజులకు గాను బోనస్ గరిష్టంగా రూ. 17,951 లభించనుంది. ఈ బోనస్ ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు (గార్డులు), స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్మెన్, మినిస్టీరియల్ సిబ్బందితో పాటు ఇతర గ్రూప్ 'సి' రైల్వే సిబ్బందికి వర్తిస్తుంది.
కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ అత్య్యుత్తమ ప్రతిభను కనబరిచింది. ఈ కాలంలో రైల్వే శాఖ రికార్డు స్థాయిలో 1670 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయడంతో పాటు, దాదాపు 741 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది.
