- 24 రన్స్ తేడాతో ఇండియా ఓటమి
- శాంసన్, తిలక్, నితీష్ పోరాటం వృథా
హైదరాబాద్, వెలుగు: భారీ ఛేజింగ్‌లో బ్యాటర్లు బోల్తా కొట్టడంతో.. నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇండియాకు ఓటమి తప్పలేదు. కెప్టెన్ షై హోప్ (50 బాల్స్‌లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 102 నాటౌట్) సూపర్ సెంచరీకి తోడు షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (26 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 నాటౌట్) దంచికొట్టడంతో.. బుధవారం జరిగిన మ్యాచ్‌లో విండీస్ 24 రన్స్ తేడాతో ఇండియాను ఓడించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–2తో సమం చేసింది.
టాస్ ఓడిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 247/3 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో ఇండియా 19.4 ఓవర్లలో 223 రన్స్‌కు ఆలౌటైంది. సంజూ శాంసన్ (23 బాల్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56), తిలక్ వర్మ (25 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43), నితీష్ కుమార్ (20 బాల్స్‌లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 41) రాణించినా ప్రయోజనం దక్కలేదు. హోప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ శనివారం బెంగళూరులో జరుగుతుంది.
బౌలర్లు ఫెయిల్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు చేతులెత్తేయగా, హోప్ ఈ సిరీస్‌లో రెండో సెంచరీతో భారీ స్కోరు అందించాడు. తొలి ఓవర్లో మూడు రన్స్‌తో సరిపెట్టినా.. తర్వాత ఫోర్లు, సిక్సర్ల జాతర చూపెట్టాడు. రెండో ఓవర్లో జెవెల్ ఆండ్రూ (21) 6, 4, 4తో 17 రన్స్ దంచాడు. మూడో ఓవర్లో 6, 4తో టచ్‌లోకి వచ్చిన హోప్.. నాలుగో ఓవర్లోనూ రిపీట్ చేశాడు.
అయితే ఐదో ఓవర్లో అక్షర్ పటేల్ (1/45) దెబ్బకు ఆండ్రూ ఔట్ కావడంతో తొలి వికెట్‌కు 52 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఆ తర్వాత హోప్ సిక్సర్, హెట్మయర్ (33) 4, 4, 6తో పవర్‌ప్లేలో విండీస్ 79/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత కూడా హెట్మయర్ రెండు ఫోర్లతో బ్యాట్ ఝుళిపించాడు. 8వ ఓవర్లో హోప్ 6, 4, హెట్మయర్ 6తో 19 రన్స్ వచ్చాయి. కానీ 9వ ఓవర్లో హెట్మయర్ ఔట్‌తో రెండో వికెట్‌కు 58 రన్స్ భాగస్వామ్యం ముగిసింది.
తొలి పది ఓవర్లలో విండీస్ 118/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. 11వ ఓవర్లో సిక్స్‌తో హోప్ 28 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 12వ ఓవర్లో పావెల్ (24) 4, 6, 4, హోప్ 6తో 22 రన్స్ వచ్చాయి. 13వ ఓవర్లో పావెల్ వెనుదిరిగినా.. హోప్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సింగిల్స్‌తో కుదురుకున్న రూథర్‌ఫోర్డ్ తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. దాంతో 15 ఓవర్లలో స్కోరు 177/3కి పెరిగింది. 17వ ఓవర్లో హోప్ 4, రూథర్‌ఫోర్డ్ 6, 4, 6తో 22 రన్స్ వచ్చాయి. సెంచరీకి చేరువైన హోప్ చివర్లో ఒక ఫోర్, రెండు సిక్స్‌లతో 50 బాల్స్‌లో ట్రిపుల్ డిజిట్ స్కోరును అందుకున్నాడు. రూథర్‌ఫోర్డ్‌తో నాలుగో వికెట్‌కు 91 రన్స్ జోడించడంతో విండీస్ భారీ స్కోరు చేసింది.
శాంసన్, తిలక్ మాత్రమే..
భారీ ఛేజింగ్‌లో ఇండియాకు ఓపెనర్ శాంసన్ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. ఫోర్‌తో ఖాతా తెరిచిన శాంసన్ రెండో ఓవర్లో 4, 6, 6తో 18 రన్స్ దంచాడు. తర్వాతి ఓవర్లోనూ 4, 6, 6, 4తో 25 రన్స్‌తో విరుచుకుపడ్డాడు. నాలుగో ఓవర్లో మరో రెండు ఫోర్లతో 20 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఐదో ఓవర్లో కీమో పాల్ (5/41) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. నాలుగు బాల్స్ తేడాలో శాంసన్, ఇషాన్ కిషన్ (6)ను ఔట్ చేయడంతో ఇండియా స్కోరు 67/2గా మారింది. అభిషేక్ (29) తో కలిసిన శ్రేయస్ అయ్యర్ (16) నిలకడతో ఇండియా 80/2 స్కోరుతో పవర్‌ప్లేను ముగించింది.
తర్వాత సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేసిన ఈ జోడీని 9వ ఓవర్లో శ్రేయస్‌ను ఔట్ చేసి షామెర్ స్ప్రింగర్ (1/40) విడగొట్టాడు. తొలి 10 ఓవర్లలో ఇండియా 115/3 స్కోరు చేసింది. 11వ ఓవర్లో తిలక్ వర్మ 4, 6 దంచినా.. 12వ ఓవర్లో గుడకేశ్ మోతీ (2/13) దెబ్బ కొట్టాడు. ఫోర్ కొట్టిన అభిషేక్‌ను, నమన్ ధీర్ (0)ను వరుస బాల్స్‌లో ఔట్ చేశాడు. ఫలితంగా నాలుగో వికెట్‌కు 33 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఇక్కడి నుంచి తిలక్, నితీష్ కుమార్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు.
వీలైనప్పుడల్లా ఫోర్లు, సిక్స్‌లు కొట్టారు. 15 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 168/5కు చేరింది. ఇక చివరి ఐదు ఓవర్లలో 80 రన్స్ చేయాల్సిన దశలో 16వ ఓవర్లో నితీష్ 4, 6, 6తో 21 రన్స్ రాబట్టాడు. 17వ ఓవర్లో సిక్స్ కొట్టిన తిలక్ చివరి బాల్‌కు ఔటయ్యాడు. ఆరో వికెట్‌కు 70 రన్స్ జతయ్యాయి. 19వ ఓవర్లో పాల్ నాలుగు బాల్స్ తేడాలో నితీష్, ప్రిన్స్ యాదవ్ (0), అక్షర్ పటేల్ (3)ను ఔట్ చేయడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
వెస్టిండీస్: 20 ఓవర్లలో 247/3 (హోప్ 102*, రూథర్‌ఫోర్డ్ 49*, ప్రిన్స్ యాదవ్ 1/36).
ఇండియా: 19.4 ఓవర్లలో 223 ఆలౌట్ (శాంసన్ 56, తిలక్ 43, నితీష్ 41, కీమో పాల్ 5/41).
