టీ20ల్లో మరింత కష్టపడాలి: స్మృతి

టీ20ల్లో మరింత కష్టపడాలి: స్మృతి

రాయ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌: వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ గెలిచినప్పటికీ, షార్ట్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమిండియా ఇంకా ఎంతో శ్రమించాల్సి ఉందని కొత్త  కెప్టెన్ స్మృతి మంధాన స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో విమెన్స్‌‌‌‌‌‌‌‌ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో టీ20లపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పింది. జింబాబ్వేతో జరిగే మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌కు ముందు రాయ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మంధాన మాట్లాడింది. హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ కౌర్ స్థానంలో పూర్తి స్థాయి కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు చేపట్టిన మంధాన, ఈ పాత్ర తనకు కొత్తేమీ కాదని వెల్లడించింది.

‘గత పదేళ్లుగా వైస్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించిన అనుభవం నాకు ఉంది. జట్టును ముందుకు నడిపించే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తా.  కెప్టెన్సీ భారం నా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌పై ఎలాంటి ప్రభావం చూపదు. క్రీజులో ఉన్నప్పుడు ఎప్పుడూ కెప్టెన్ బాధ్యతతోనే ఆడానని, జట్టు అవసరాలకు తగినట్టుగా బ్యాటింగ్ కొనసాగిస్తా. జెమీమా రోడ్రిగ్స్ గాయం కారణంగా దూరమైనప్పటికీ, జట్టులో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు.

అనుష్క శర్మ, నికీ ప్రసాద్, కమలిని వంటి వారు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. జట్టులో ప్రత్యామ్నాయాలకు కొదవ లేదు’ అని మంధాన పేర్కొంది. బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా, హెడ్ కోచ్ అమోల్ మజుందార్, హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ కౌర్‌‌‌‌‌‌‌‌తో జరిగిన సమావేశంలో ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్ భవిష్యత్తు, రాబోయే రెండు మూడు సంవత్సరాల ప్రణాళికలపై చర్చించినట్లు వెల్లడించింది.