- ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద మెరుపు ధర్నా
- అంకిత భండారి పేరెంట్స్‌తో కలిసి నిరసన
ఉత్తరాఖండ్‌లో 2022లో హత్యకు గురైన అంకిత భండారి తల్లిదండ్రులను కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బుధవారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద పరామర్శించారు. తమ కూతురు హత్య ఘటన వెనక ఉన్న బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించే ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వీరేంద్ర సింగ్ భండారి, సోనీ దేవి దంపతులు ఇండియా గేట్ వద్ద నిరసన చేపట్టారు.
అంకిత హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయ్యేవరకు గౌతమ్‌ను గవర్నర్‌గా నియమించే ప్రక్రియను నిలిపివేయాలని వారు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. ఈ నిరసన సందర్భంగా రాహుల్, ప్రియాంక వారిని పరామర్శించి, సంఘీభావం తెలిపారు.
కూతురు మరణించి నాలుగేళ్లు గడిచినా వారు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని అన్నారు. కాగా, రిషికేశ్‌లోని వనంత్ర రిసార్ట్‌లో రిసెప్షనిస్టుగా పని చేస్తున్న అంకిత భండారి 2022 సెప్టెంబర్ 18న హత్యకు గురైంది. ఆ తర్వాత చిల్లా కాలువలో ఆమె డెడ్‌బాడీ దొరికింది.
ఈ కేసులో రిసార్ట్ యజమాని, బీజేపీ మాజీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య, మరో ఇద్దరు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఈ హత్య వెనుక ఓ వీఐపీ కూడా ఉన్నారని, ఆయనే దుష్యంత్ కుమార్ గౌతమ్ అన్న ఆరోపణలు వచ్చాయి. కాగా, తనపై ఆరోపణలు చేసినవారిపై గౌతమ్ పరువునష్టం దావా వేశారు.
