ఇసుకతో కాసుల గలగల.. 6 నెలల్లోనే రూ.591 కోట్ల రికార్డు ఇన్కం.. గతేడాది ఇదే సమయానికి రూ.461 కోట్లే

ఇసుకతో కాసుల గలగల.. 6 నెలల్లోనే రూ.591 కోట్ల రికార్డు ఇన్కం.. గతేడాది ఇదే సమయానికి రూ.461 కోట్లే
  • అడ్డదారులకు బ్రేక్.. దళారులకు చెక్
  • ఈసారి పారదర్శకంగా ఆన్​లైన్ బుకింగ్
  • రీచుల్లో సీసీ కెమెరాలు.. లారీలకు జీపీఎస్ ట్రాకింగ్ 
  • మైన్స్ సర్వైలెన్స్ సిస్టమ్తో వే బ్రిడ్జిల లింక్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇసుక విక్రయాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన దళారీ వ్యవస్థకు చెక్ పెడుతూ గనుల శాఖ చేపట్టిన సంస్కరణలు ఆశించిన ఫలితాలనిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2025-26)లో ఇసుక ద్వారా రూ.1,003 కోట్ల రాబడి రాగా, 2026–27లో 6 నెలల్లోనే ఏకంగా రూ.591 కోట్లు వసూలయ్యాయి.

గతేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.461 కోట్ల ఆదాయం సమకూరగా, ఈసారి రూ.130 కోట్ల అదనపు ఆదాయంతో సరికొత్త మైలురాయిని అందుకుంది. రీచుల వద్ద కాంట్రాక్టర్ల పెత్తనానికి కళ్లెం వేస్తూ, సాంకేతికతో కూడిన పారదర్శక విధానాన్ని అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెప్తున్నారు.

గతంలో ఉన్న అక్రమ తవ్వకాలు, రవాణా, నకిలీ వేబిల్లుల దందాలకు చెక్​పెట్టడమే ఇందుకు కారణమంటున్నారు. వర్షాకాలంలో సాధారణంగా ఇసుక కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్నంటే పరిస్థితి ఉండేది. కానీ, ఈసారి ముందస్తు నిల్వల వ్యూహంతో ఆ సమస్య తలెత్తకుండా చూశారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇసుక ఆదాయం ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్ రికార్డును సృష్టించడం ఖాయమని ఎక్స్​పర్ట్స్​అంచనా వేస్తున్నారు.

నెలవారీ అమ్మకాల్లో వృద్ధి
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు నమోదైన నెలవారీ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే ఆదాయంలో నిలకడైన వృద్ధి కనిపిస్తున్నది.  గతేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 19 లక్షల మెట్రిక్ టన్నుల ద్వారా రూ.81 కోట్లు రాగా, ఈసారి 23 లక్షల మెట్రిక్ టన్నుల అమ్మకాలతో ఏకంగా రూ.102 కోట్లు సమకూరాయి. 

మే నెలలో క్రితంసారి 21 లక్షల మెట్రిక్ టన్నులకు రూ.89 కోట్లు రాగా, ఈ ఏడాది 25 లక్షల మెట్రిక్ టన్నులతో రూ.112 కోట్లు వచ్చి 26.28 శాతం వృద్ధి నమోదైంది. నిర్మాణ రంగం జోరుగా సాగిన జూన్ నెలలో గత ఏడాది 25 లక్షల మెట్రిక్ టన్నులకు రూ.103 కోట్లు రాగా, ఈసారి 30 లక్షల టన్నులతో రికార్డు స్థాయిలో రూ.133 కోట్లు వచ్చాయి.

భారీ వర్షాలు కురిసిన ఆగస్టులోనూ క్రితంసారి 13 లక్షల టన్నులకు రూ.62 కోట్లు రాగా, ఈ ఏడాది ఏకంగా 16 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరాతో రూ.72 కోట్ల ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ నెలలో గతేడాది 11 లక్షల టన్నులకు రూ.52 కోట్లు మాత్రమే రాగా, ఈ ఏడాది 16 లక్షల టన్నుల విక్రయాలతో రూ.70 కోట్లు ఆర్జించి 34.72 శాతం వృద్ధి సాధించారు. గతేడాదితో పోలిస్తే ఇసుక అమ్మకాల పరిమాణంలో 28 లక్షల టన్నుల పెరుగుదల కనిపించింది.

సీసీ కెమెరాలతో పకడ్బందీ నిఘా
ఇసుక తవ్వకాలు, రవాణాలో అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన నిఘా వ్యవస్థ అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతీ ఇసుక రీచ్, స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యార్డు వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి గనుల శాఖ ప్రధాన కార్యాలయానికి అనుసంధానించారు.

ప్రతీ రీచ్ వద్ద అధునాతన డిజిటల్ వే-బ్రిడ్జిలను ఏర్పాటు చేశారు. వీటిని ఇంటిగ్రేటెడ్ మైన్స్ సర్వైలెన్స్ సిస్టమ్(ఎంఎస్ఎస్) సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అనుసంధానం చేయడంతో మానవ తప్పిదాలకు ఆస్కారం లేకుండా పోయింది. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడింగ్ వాహనాలకు కంప్యూటర్ సిస్టమే గేట్ పాస్ నిరాకరిస్తూ ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గేట్లను లాక్ చేసేలా వ్యవస్థను రూపొందించారు.

జియో ఫెన్సింగ్ విధానం..
ఇసుక రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ బిగించడం మార్పునకు కారణమైంది. రీచ్ నుంచి బయలుదేరిన లారీ నిర్దేశిత రూట్లలోనే ప్రయాణిస్తోందా, వేరే ప్రాంతాలకు వెళ్తోందా అనేది జియో -ఫెన్సింగ్ విధానం ద్వారా పసిగడుతున్నారు. ఏదైనా వాహనం దారి మళ్లితే కమాండ్ కంట్రోల్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎస్ఎంఎస్ రూపంలో హెచ్చరికలు వెళ్తున్నాయి. దీంతో అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి అక్రమంగా తరలించే ఇసుక మాఫియా నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ పూర్తిగా కుదేలైంది.

మరోవైపు ప్రభుత్వ పోర్టల్ ద్వారా పారదర్శక ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. చెల్లింపులను డిజిటలైజ్ చేయడంతో లంచాలకు, దళారుల జోక్యానికి అవకాశం లేకుండాపోయింది. డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ(డీఎంజీ) అధికారులతో క్షేత్రస్థాయి పర్యటనలు చేయిస్తూ నిబంధనలు పాటించని రీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు జరిమానా విధిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే కాంట్రాక్టర్లను బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్టులో పెడుతూ పారదర్శక పద్ధతుల్లో వేలం వేస్తూ ప్రభుత్వానికి రాబడి పెంచుతున్నారు.