- వరంగల్‌లో నీటి ఎద్దడి రాకుండా సర్కారు చర్యలు
- వరంగల్ లో తగ్గిన భూగర్భజలాలు పెంచేందుకు చర్యలు
- ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల నీటి పంపింగ్ షురూ
- భద్రకాళి చెరువుకు చేరుతున్న 50 ఎంసీఎఫ్‌టీ గోదారి నీళ్లు
వరంగల్, వెలుగు : గ్రేటర్ వరంగల్‌లో నీటిఎద్దడి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వరంగల్ లోని భద్రకాళి చెరువుకు దేవాదుల ప్రాజెక్ట్ నుంచి గోదావరి నదిజలాలను తరలిస్తోంది.
ఎల్‌నినో ప్రభావంతో సిటీలో గ్రౌండ్ వాటర్ తగ్గి రాబోయే రోజుల్లో నీటిఎద్దడి రానుందన్న అంచనాలతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వారం కిందట సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు.
దీంతో ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి భద్రకాళి చెరువుకు నీరు తరలించాలని సీఎం ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. నాలుగు రోజుల కింద నీటిని వదలగా మంగళవారం రాత్రి భద్రకాళి చెరువులోకి నీళ్లు చేరాయి.
రూ.10 కోట్లతో చెరువు పూడికతీత
కాకతీయుల కాలంలో నిర్మించిన వరంగల్, హనుమకొండ మధ్య ఉండే భద్రకాళి చెరువు దాదాపు 382 ఎకరాల్లో ఉంది. 1994 వరకు భద్రకాళి చెరువు ద్వారా వరంగల్ సిటీలోని 4 లక్షల మందికి మంచినీరు అందించారు. అనంతరం ధర్మసాగర్ చెరువును రిజర్వాయర్‌గా మార్చడంతో అక్కడి నుంచే ఫిల్టర్ బెడ్ ద్వారా నగరంలో మంచినీటి సరఫరా మొదలైంది.
ఆపై భద్రకాళి చెరువులో అడవి తుంగ, వ్యర్థాలు చేరడంతో చెరువు రూపు కోల్పోయింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం భద్రకాళి చెరువును అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు సిద్ధమైంది. దాదాపు 50 ఏండ్ల తర్వాత మొదటిదశలో రూ.10 కోట్లతో పూడికతీత పనులకు శ్రీకారం చుట్టింది. పర్యాటక కేంద్రంగా మార్చే క్రమంలో ఐ లాండ్స్ పనులు మొదలుపెట్టగా గతంలో వరద కారణంగా పనులు మధ్యలో ఆగాయి.
సిటీలో పెరగనున్న గ్రౌండ్ వాటర్
భద్రకాళి చెరువు 150 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీటి సామర్థ్యం ఉండగా పూడికతీత ద్వారా మరో 50 ఎంసీఎఫ్‌టీ మేరకు కెపాసిటీ పెంచాలని భావించారు. పనులు దాదాపు 80 శాతం వరకు పూర్తిచేశారు. దీంతో నీటిసామర్థ్యం విలువ 180 నుంచి 200 ఎంసీఎఫ్‌టీకి పెరిగింది. కాగా, ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుతం నగరంలో గ్రౌండ్ వాటర్ తగ్గింది.
ఇప్పటికే అక్కడక్కడ నీటి సమస్య తలెత్తగా, వేసవిలో నీటి ఎద్దడి తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. దాంతో ముందస్తుగా ధర్మసాగర్ నుంచి భద్రకాళి చెరువులోకి 50 మిలియన్ క్యూబిక్ ఫీట్ల గోదావరి నీటిని నింపుతున్నారు. దీంతో హనుమకొండ, వరంగల్ పరిధిలో ఉండే 25 నుంచి 30 కాలనీల్లో గ్రౌండ్‌వాటర్ పెరగనుంది.
నీటి ఎద్దడిని ఎదుర్కొనేలా చర్యలు
ఎల్‌నినో ప్రభావాన్ని ముందస్తుగా ఎదుర్కొవడంలో భాగంగానే భద్రకాళి చెరువును ఇప్పటికిప్పుడు ధర్మసాగర్ రిజర్వాయర్ నీటితో నింపుతున్నాం. వానాకాలంలోనే వర్షాల్లేక నగరంలో భూగర్భజలాలు తీవ్రంగా పడిపోయాయి.
సకాలంలో చర్యలు తీసుకోకుంటే రాబోయే రోజుల్లో కాలనీలు, సిటీలోని అపార్టుమెంట్లలో బోర్లు పనిచేసే పరిస్థితులు కనిపించట్లేదు. అందుకు చెరువును నింపితే చుట్టూ కాలనీల్లో గ్రౌండ్ వాటర్ పెరిగి, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవచ్చు. ఒకవేళ మంచినీటి సమస్య ఏర్పడితే అందుబాటులో ఉండే చెరువులోని నీటిని వాడుకునే అవకాశం కూడా ఉంటుంది.
-ఎమ్మెల్యే నాయిని-
