- స్పీడ్గా కాప్రా చెరువు పునరుద్ధరణ పనులు
- ఇప్పటికే 60 శాతం పనులు పూర్తి
హైదరాబాద్ సిటీ, వెలుగు : ఒకప్పుడు ఆస్ట్రేలియా, యూరప్ సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే 470కిపైగా వలస పక్షులకు కాప్రా చెరువుకు తరలివచ్చేవి. బ్లాక్-క్రౌన్డ్ నైట్ హెరాన్, పెయింటెడ్ స్టార్క్స్ కొంగలు, ఇండియన్ కార్మోరెంట్ నీటి కాకులు, బ్రాంజ్-వింగ్ జకానా పక్షులు, ఇండియన్ స్పాట్-బిల్డ్ బాతులు కాప్రా చెరువులో దర్శనమిచ్చేవి.
కేంద్ర ప్రభుత్వం కూడా వెట్ల్యాండ్స్లో ఒకటిగా కాప్రా చెరువును గుర్తించింది. ఎందుకంటే వెట్ల్యాండ్స్..అరుదైన పక్షులతో పాటు జంతువులు, కీటకాలు, నీటి మొక్కలకు ఆశ్రయమిస్తాయి. అదనపు వర్షపు నీటిని స్పాంజ్ లా పీల్చుకుని, వరదలు రాకుండా అడ్డుకుంటాయి. ప్రకృతి సిద్ధమైన ఫిల్టర్లుగా నీటి కాలుష్యాన్ని, వ్యర్థాలను శుద్ధి చేస్తాయి.
గ్రౌండ్వాటర్ను పెంచుతాయి. ఇలాంటి అద్భుత చెరువు తరతరాలుగా ఆక్రమణలకు గురైంది. గత పాలకుల నిర్లక్ష్యానికి గురై కళావిహీనంగా మారింది. చెరువు దీనస్థితిని తెలుసుకున్న హైడ్రా రంగంలోకి దిగి చెరువు పరిధిలో అక్రమ కట్టడాలను, కంచెలను తొలగించింది. గుర్రపుడెక్క, ప్లాస్టిక్, నిర్మాణ వ్యర్థాలను క్లియర్ చేసింది. రూ.35 కోట్లతో చేపట్టిన పునరుద్ధరణ పనుల్లో ఇప్పటికే 60 శాతం కంప్లీట్అయ్యాయి.
గొప్ప విషయం ఏంటంటే..112.80 ఎకరాల ఎఫ్టీఎల్ ఉన్న ఈ చెరువు అభివృద్ధికి స్థానిక రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఎఫ్టీఎల్ పరిధిలోని తమ 70 ఎకరాలను అభివృద్ధికి అప్పగించారు. దీంతో ఇంతకుముందున్న నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచారు. నీరు చెరువులోకి సులభంగా చేరేలా ఇన్లెట్, అదనపు నీరు బయటకు వెళ్లేలా ఔట్లెట్ వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతోపాటు పటిష్టమైన ఫెన్సింగ్ నిర్మిస్తున్నారు.
