ప్రజావాణి పోర్టల్‌‌‌‌ లో ఉద్యమకారుల దరఖాస్తులు

ప్రజావాణి పోర్టల్‌‌‌‌ లో ఉద్యమకారుల దరఖాస్తులు
  •     మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అప్లికేషన్ల స్వీకరణ
  •     చీఫ్‌‌‌‌ సెక్రటరీ సంజయ్‌‌‌‌ జాజు యూవో నోట్‌‌‌‌ జారీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారుల వివరాల సేకరణ, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం ప్రజావాణి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ ద్వారా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌‌‌‌ సెక్రటరీ సంజయ్‌‌‌‌ జాజు యూవో నోట్‌‌‌‌ జారీ చేశారు. రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శికి ఉత్తర్వులు పంపిస్తూ.. వెంటనే ప్రత్యేక మాడ్యూల్‌‌‌‌ ఏర్పాటు చేయాలని సూచించారు.

నెల రోజులే గడువు.. 

మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న ఉద్యమకారులు ఎక్కడి నుంచైనా దరఖాస్తులు సమర్పించేందుకు ఈ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ ఉపయోగపడనుంది. మాడ్యూల్‌‌‌‌ అందుబాటులోకి వచ్చిన రోజు నుంచి నెల రోజుల పాటు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారం, గుర్తింపు ప్రక్రియలో ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. పోర్టల్‌‌‌‌లో లింక్‌‌‌‌ అందుబాటులోకి రాగానే మీ-సేవ లేదా ప్రజావాణి కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. గడువు ముగిశాక మండల, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు దరఖాస్తులను పరిశీలించి తుది జాబితా రూపొందించనున్నాయి. అర్హులకు సంక్షేమ పథకాలు, గుర్తింపు కార్డులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా పోర్టల్‌‌‌‌ను అందుబాటులోకి తేవాలని అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.

కేకే లేఖ ఆధారంగా చర్యలు.. 

తెలంగాణ ఉద్యమకారుల కమిటీ చైర్మన్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ కె. కేశవరావు గతేడాది ప్రభుత్వానికి రాసిన అధికారిక లేఖ ఆధారంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. అధికారులు రూపొందించిన అప్లికేషన్‌‌‌‌ ఫారంలో మొదటి పది కాలమ్‌‌‌‌లలో ఉద్యమకారుల ప్రాథమిక వివరాలు నమోదు చేయాలి. మిగతా కాలమ్‌‌‌‌లలో ఉద్యమంలో పాల్గొన్న ఆధారాలు, కేసుల వివరాలు, సర్టిఫికెట్లు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా జరిగేలా ఫార్మాట్‌‌‌‌ను రూపొందించారు. ఈ ప్రక్రియ ఉద్యమకారుల డిమాండ్లను పరిష్కరించేందుకు, పోరాట యోధులను అధికారికంగా గుర్తించేందుకు దోహదపడనుంది. ఉద్యమకారుల కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా, పోర్టల్‌‌‌‌ ఏర్పాటుకు అధికారులు సాంకేతిక చర్యలు చేపడుతున్నారు.