అందరి త్యాగాలు.. కొందరి భోగాలు.. త్యాగాల తెలంగాణలో భోగాలు వీళ్లకేనా?

అందరి త్యాగాలు.. కొందరి భోగాలు.. త్యాగాల తెలంగాణలో భోగాలు వీళ్లకేనా?

సబ్బండ వర్ణాల సద్దిమూట తెలంగాణ.. ముక్కోటి గొంతుకల ఆకాంక్ష స్వరాష్ట్రం. సొంత రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు బాగుపడుతాయనుకొని ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన వాళ్లు కనుమరుగయ్యారు. లాఠీలు, తూటాలకు వెరవక ముందుండి పోరాడిన వారు అడ్రస్ లేకుండా పోయారు. భావితరాల బాగుకోసమని ఆత్మార్పణ చేసుకున్న వారి కుటుంబాలకు కన్నీటి వ్యథే మిగిలింది.

నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్​తో వచ్చిన ఉద్యమం తెలంగాణను తెచ్చింది. కానీ పోరులో ముందుండి నిలిచిన వారు కొవ్వొత్తిలా కరిగిపోయారు. కొందరికే పదవులు వచ్చాయి.. ఆస్తులు, అంతస్తులు వచ్చాయి. లక్షల కోట్లకు ఎదిగారు..! బతుకులు ఆగమైన వారిని చూసి తెలంగాణ తల్లి తల్లడిల్లుతోంది. ‘నయా’ వంచనను అనుదినం గుర్తుకు చేసుకుంటున్నది.

ఉద్యమం కోసం బతుకు 

పణంపెట్టిన వేలాదిమంది

అటు ప్రాణాలు బలిపెట్టినవాళ్లు, 

ఇటు నిండామునిగినవాళ్లు

రాజకీయ ఆటలో అవమానాల 

పాలైన ఉద్యమకారులు

స్వరాష్ట్రంలోనూ దక్కని గౌరవం

కొందరికే అధికారం, పదవులు, 

ఆస్తులు, అంతస్తులు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోట్లాది ప్రజల ఆకాంక్ష. సబ్బండ వర్ణాల  రణనినాదం ‘జై తెలంగాణ’.  స్వరాష్ట్ర ఆకాంక్షతో  ఏదీ ఆశించకుండా, ఉన్నది ఎదురుపెట్టి ఉద్యమానికి అంకితమైనవాళ్లెందరో! కోరుకున్న తెలంగాణ సాకారమైంది. ఇట్లా జెండాలు మోసి, ఆస్తులు అమ్ముకొని, ఉద్యోగాలు వదులుకొని, కుటుంబాలను పణంగా పెట్టిన త్యాగాలకు లెక్కలేదు. 

కానీ వారి కష్టానికి, త్యాగానికి తగిన గౌరవం దొరకలేదు. కనీసం గుర్తింపు దక్కలేదు. సర్వం ధారపోసి రోడ్డునపడిన నిఖార్సయిన ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. అప్పులపాలైనవాళ్లు, రాజకీయ భవిష్యత్ పోగొట్టుకున్నవాళ్లు, జైళ్లపాలైనవాళ్లు, లాఠీదెబ్బలు తిన్నవాళ్లకు లెక్కేలేదు.

1969.. యాదిలేని త్యాగాలు
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆకాంక్షను గుర్తుచేసిన తొలి దశ పోరాటం1969 ఉద్యమం. విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులు పెద్దఎత్తున పాల్గొన్న ఈ పోరాటంలో పోలీసు కాల్పుల్లో వందలాది మంది ప్రాణాలు బలిపెట్టారు. 

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 369 మంది అమరులయ్యారని చెబుతారు. ఆ పోరాటంలో చదువులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయిన కుటుంబాలెన్నో. అప్పటి పోరాటయోధులు ఏ కొందరో తప్ప చాలామందిని గుర్తించలేని దుస్థితి. 1969 ఉద్యమకారులను కూడా గుర్తించే ప్రయత్నం ఎన్నడూ జరగలేదు.

నిజాం కాలం నాటి పోరాట స్ఫూర్తిని, 1969 ఉద్యమ ఆకాంక్షలను కొనసాగిస్తూ మలిదశ ఉద్యమానికి నడిపించిన వారిలో ప్రొఫెసర్ జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవరావు జాదవ్ లాంటి ప్రముఖులతో పాటు వారి బాటలో ఎంతో మంది విద్యార్థి నాయకులు, ప్రజాసంఘాల నేతలు, కవులు, కళాకారులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు. 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించడంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఒక రాజకీయ వేదిక దొరికినట్లైంది. అప్పటికే ఉద్యమస్ఫూర్తితో ఉన్నవాళ్లు, సొంత వేదికలు, సంఘాలు నడిపిస్తున్నవాళ్లంతా అండగా నిలిచారు.

తెలంగాణ రాజకీయ జేఏసీ, విద్యార్థి జేఏసీలు, ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాలు, సాంస్కృతిక బృందాలు రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేశాయి. అట్లా మొదలైన రెండోదశ పోరాటం 2014లో రాష్ట్రాన్ని సాకారం చేసింది. దాదాపు రెండుదశాబ్దాలు సాగిన ఈ ఉద్యమంలో ఉద్యోగాలు, వ్యాపారాలు వదిలి, ఆస్తులు అమ్మి పెట్టినవాళ్లున్నారు. ఆర్థికంగా కుంగిపోయినా ఆశయం కోసం అంకితమైనవాళ్లున్నారు. కానీ రాష్ట్రం సాధించుకున్న 12 ఏండ్లకు కూడా వారిని గుర్తించి గౌరవించే పని ముంగట పడలేదు.

ప్రజా తెలంగాణ కోసం పోరుబాట
కరీంనగర్ జిల్లాకు చెందిన ఆకుల భూమయ్య 1969తోపాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేసి ఉద్యమ శక్తులను ఏకం చేసిన ఆయన స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరకముందే కన్నుమూశారు.  వీరితోపాటు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి, ప్రొఫెసర్ వెంకటనారాయణ, విమలక్క, రత్నమాల, పీవోడబ్ల్యూ సంధ్య, గొర్రెపాటి మాధవరావు, గోవర్ధన్‌లాంటి మేధావులు, కళాకారులు సామాజిక, ప్రజా ఉద్యమాలను నడిపించారు.

డీఎస్పీ నళిని, ఇటిక్యాల పురుషోత్తం, వెలిచాల జగపతి రావు, దేశిని చిన్నమల్లయ్య, కటకం మృత్యుంజయం, కొరివి వేణుగోపాల్,వెంకట మల్లయ్య, మెదక్ జిల్లాకు చెందిన బాణాపురం మధుసూదన్‌రెడ్డి, సిద్దిపేటకు చెందిన నిమ్మ నర్సింహారెడ్డి, ఉపాధ్యాయుల ఉద్యమానికి నాయకత్వం వహించిన శిమ్ముల భూపతిరెడ్డి ఇలా చాలా మంది స్వరాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక భూమిక పోషించారు.

పార్టీలు వేరయినా.. ఆకాంక్ష ఒక్కటే
పలు రాజకీయ పార్టీల్లో ఉండి ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నేతలు చాలామంది ఉన్నారు. వారిలో నాటి టీఆర్ఎస్ నేతలు ఈటల రాజేందర్ మంత్రి అయ్యారు. ప్రొఫెసర్ సీతారామ్‌నాయక్ ఎంపీ అయ్యారు. దాసోజు శ్రవణ్  ఎమ్మెల్సీ అయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు స్వామిగౌడ్ ఎమ్మెల్సీ, శాసన మండలి చైర్మన్ అయితే.. శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయ్యారు.

సి.విఠల్, దేవీప్రసాద్‌లాంటి నేతలకు నామినేటెడ్ పోస్టులు దక్కాయి. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, అల్లం నారాయణ, మల్లేపల్లి లక్ష్మయ్య, పిట్టల రవీందర్ లాంటి వారికి పదవులు దక్కాయి. కళాకారుల్లో గోరెటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీలు అయితే రసమయి బాలకిషన్ ఎమ్మెల్యే అయ్యారు. సాయిచంద్‌కు కార్పొరేషన్ పదవి వచ్చింది.

పార్లమెంటులో గళమెత్తిన ఎంపీలు
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. స్వరాష్ట్రం కోసం మన ఎంపీలు గళమెత్తారు. హైకమాండ్ కు స్వరాష్ట్ర ఆకాంక్షను వివరించారు. తెలంగాణ బిల్లు కోసం పార్లమెంటు వేదికగా తెగించి కొట్లాడిన వారిలో  అప్పటి ఎంపీలు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మధుయాష్కీ, బలరామ్ నాయక్, సిరిసిల్ల రాజయ్య కీలక పాత్ర పోషించారు. 

స్వరాష్ట్రమే లక్ష్యంగా ఎమ్మెల్యేల ఫోరం
వనపర్తి మాజీ ఎమ్మెల్యే జీ చిన్నారెడ్డి తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం అధ్యక్షుడిగా స్వరాష్ట్ర గళం వినిపించారు.   టీఆఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు నుంచే 41 మంది ఎమ్మెల్యేలతో ఫోరాన్ని ఏర్పాటు చేసి స్వరాష్ట్ర ఆకాంక్షలను కాంగ్రెస్ అధినాయకత్వానికి తెలియజెప్పారు.   తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దీక్ష చేపట్టారు. 2011 నవంబర్ 1న ఆయన నల్లగొండలో ఈ ఆమరణ దీక్షను ప్రారంభించారు. వీరితో పాటు యాదవరెడ్డి, కత్తి వెంకటస్వామి ఇటు ఉద్యమంలో, అటు ఢిల్లీలో పార్టీ నాయకత్వాన్ని ఒప్పించడంలో కీలకంగా పనిచేశారు.

బహుజన కెరటాలకు గౌరవమేదీ?
మంద కృష్ణమాదిగ, గజ్జెల కాంతం, ఉద్యోగ నాయకుడు చంద్రశేఖర్ గౌడ్, పద్మాచారి ఉన్నారు. గిరిజన సంఘాల నేతగా ఉన్న బెల్లయ్య నాయక్‌కు సొంత రాష్ట్రంలో దశాబ్దం తర్వాత ఈమధ్యే కార్పొరేషన్ పదవి వచ్చింది. తెలంగాణ కోసమే పాటలు రాసిన గూడ అంజయ్య సొంత రాష్ట్రంలో ఏ గౌరవం లేకుండా కన్నుమూశారు. ఉద్యమానికి ఊతంగా నిలిచినవారిలో జయరాజు, యశ్ పాల్, వందేమాతరం శ్రీనివాస్, నేర్నాల కిశోర్, అంతడ్పుల నాగరాజు, తేలు విజయ, అశ్విని లాంటివాళ్లున్నారు. తెలంగాణ వచ్చాక దశాబ్దం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బండి యాదగిరి, సుద్దాల కుటుంబం, గద్దర్, అందెశ్రీ, గూడ అంజన్న, ఎక్కా యాదగిరి, పాశం యాదగిరి, గోరెటి, జయరాజు సేవలకు కోటి రూపాయల కానుక అందించింది.

పోరాటంలో ఓయూ 
కదిలిందిరా ఉస్మానియా.. ఖబడ్ధార్.. ఖబడ్దార్ అంటూ లాఠీలకు వెరువక.. టియర్ గ్యాస్ పొగలను చీల్చుకుంటూ ముందుకు ఉరికిన ఘన చరిత్ర ఉస్మానియా విశ్వవిద్యాలయానిది. వరంగల్ కేంద్రంగా ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది కాకతీయ వర్సిటీ.  కానీ రాష్ట్రం వచ్చాక విద్యార్థి నాయకులు ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయారు. 

ఓయూ కేంద్రంగా ఉద్యమంలో కీలకంగా పనిచేసినవారిలో రాజారాం యాదవ్, వరంగల్ రవి, మందాల భాస్కర్, మానవతారాయ్, దరువు ఎల్లన్న, దరువు అంజన్న, దుర్గం భాస్కర్, వంగపల్లి శ్రీనివాస్, రాజేశ్ నాయక్, మర్రి అనిల్, కైలాష్ నేత, కోట శ్రీనివాస్, స్టాలిన్, టీవీవీ విజయ్, శ్రీహరి, కరాటే రాజు, సురేందర్ గౌడ్, కంచర్ల బద్రి, డాక్టర్ ఎస్.హరినాథ్, డాక్టర్ కాటం శ్రీధర్, ఆర్.ఎన్.శంకర్, ఎం.వీరస్వామి, ఆశప్ప, ఆజాద్ లాంటివాళ్లు ఉన్నారు.

కేయూ విద్యార్థి నేతగా ఉన్న యాకూబ్ రెడ్డి ఉద్యమంలో పోలీసుల చేతిలో టార్చర్ ఎదుర్కొని చావు అంచుదాకా వెళ్లారు. వీరందరికీ తగిన గౌరవం దక్కలేదు. ఓయూ విద్యార్థి నేతలుగా ఎదిగినవారిలో బాల్క సుమన్, గాదరి కిశోర్ మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎదిగారు. పిడమర్తి రవి, క్రిశాంక్, ఆంజనేయులుగౌడ్, బాలరాజ్ యాదవ్, బాలలక్ష్మి లాంటివారు నామినేటెడ్ పోస్టులు పొందారు.

ఉద్యమకారులకు బువ్వ పెట్టి అప్పులపాలై..
హనుమకొండలో చిన్న హోటల్ నడుపుతూ ఉద్యమం కోసం బతుకును పణంగా పెట్టారు లింగాల కేదారి దంపతులు. ఉద్యమకారులకు పైసలు తీసుకోకుండా భోజనం, టిఫిన్, చాయ్ అందిస్తూ వచ్చారు.  ఆ దంపతులు చివరికి సొంత రాష్ట్రంలో అప్పుల పాలై, హోటల్ బిల్డింగ్ అద్దె కట్టలేక  ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి.

కోట్లకు పడగెత్తిండ్రు
రెండు కుటుంబాలకు చెందిన కొందరి ఆస్తులు భారీ స్థాయిలో పెరగడం సమాజంలో చర్చకు దారితీసింది. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా కేసీఆర్, ఆయన బంధువులు, సన్నిహితుల ఆస్తులు పెరిగిన తీరుపై అసెంబ్లీ సాక్షిగా చర్చ జరగడాన్ని జనం గమనించారు.  పలురూపాల్లో, పలు వేదికలపై తెలంగాణ వచ్చాక ఎవరికి మేలు జరిగిందన్న చర్చ మొదలైంది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పోగొట్టుకొని నిలువనీడ లేకుండా పోయినవారు, రాజకీయ ఆకాంక్షలున్నా పవర్ గేమ్‌లో ఎదగలేకపోయినవాళ్ల గురించి ఆలోచన మొదలైంది. ఇంతమంది కష్టంతో ఇంత కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఆ త్యాగాలకు, కష్టాలకు గౌరవం, గుర్తింపు దక్కాలని సమాజం కోరుకుంటోంది. 

ఇకనైనా గౌరవం దక్కేనా?
తెలంగాణ ఉద్యమం ఒక్కరిది కాదు. ఒక్క పార్టీది కాదు. ఒక్క కుటుంబానిది కాదు. అది తరతరాల ప్రజల ఆకాంక్ష. అమరుల త్యాగాలు,  సబ్బండ వర్ణాల పోరాటాల ఫలితం. ఆ కష్టానికి ఫలితం దక్కాలి. వారికి న్యాయం చేస్తామని ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపు కమిటీని ఏర్పాటుచేసింది. పార్టీలు, సంఘాలు, వర్గాలతో ఆ కమిటీ సంప్రదింపులు జరుపుతోంది. ఉద్యమకాలంలో కష్టనష్టాల పాలై, సొంత రాష్ట్రంలోనూ గుర్తింపు దక్కని ఆవేదనలో ఉన్నవారికి న్యాయం జరగాలి. తగిన గౌరవంతో వారికి సమాజం అండగా ఉందన్న భరోసా కల్పించాలి. ఆ పని ఇక వేగంగా జరగాలని ఆశిద్దాం.  ఇంకా ఎందరో మహనీయులున్నారు. 

త్యాగాల తెలంగాణలో భోగాలు వీళ్లకేనా?
మలిదశ ఉద్యమంలో ముందుగా వినిపించే పేరు కేసీఆర్. టీఆర్ఎస్ స్థాపనతో తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదిక ఇచ్చిన ఆయన రాష్ట్ర సాధన తర్వాత మొదటి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.  ఉద్యమనాయకుడిగా మొదటి  ప్రయోజనాన్ని దక్కించుకున్నారు. ఆయన ప్రభుత్వంలో ఆయన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు కీలక శాఖల మంత్రులయ్యారు. ఆయన బిడ్డ కవిత ఎంపీ అయ్యారు. అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలోనూ వీరే కీలకంగా ఉన్నారు. 

కేసీఆర్ బంధువు బోయినపల్లి వినోద్‌రావు ఎంపీ అయితే, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, తర్వాత ఆయన కొడుకు ఎమ్మెల్యేలు అయ్యారు. మరో బంధువు సంతోష్‌రావు రాజ్యసభ ఎంపీ అయ్యారు. కేసీఆర్ రెండో టర్మ్ లోనూ కేటీఆర్, హరీశ్ కీలకంగా ఉంటే ఎంపీగా ఓడిన కవితకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఉద్యమంలో పనిచేసినందుకు కుటుంబీకులకు పదవులివ్వడం న్యాయమేనని టీఆర్ఎస్ నేతలు సమర్థించుకున్నారు. మరోవైపు అంతకంటే కీలకంగా పనిచేసిన ఉద్యమకారులు, ఇతర వర్గాల నేతలకు కనీస గౌరవం దక్కలేదు. ఆస్తులమ్మి ఎదురుపెట్టినవాళ్లు  చాలామంది  ఇప్పుడు ఆనవాలు లేకుండా కనుమరుగయ్యారు.

తెలంగాణ కోసం బలిపీఠ మెక్కిండ్రు
ఉద్యమంలో ముందుగా గుర్తుచేసుకోవాల్సిన వారు అమరులు, బలిదానాలు ఇచ్చినవాళ్లే. 1969 ఉద్యమంలో వందలమంది పోలీసు తూటాలకు ఎదురెళ్లి ప్రాణాలు కోల్పోయారు. మలిదశ ఉద్యమంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి కొందరు, తమ చావుతో అయినా రాష్ట్రం రావాలన్న ఆశయంతో మరికొందరు, ఆవేదన, నిరాశతో ఇంకొందరు ప్రాణాలను అర్పించారు. వారిలో కొందరి పేర్లు ఇవి. కాసోజు శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి, మందాడి యాదిరెడ్డి, సాయికుమార్, ఇషాన్ రెడ్డి, వరంగల్ సునీల్, స్వర్ణ ఇలా మరెందరో అసువులు బాశారు. ఇట్ల దాదాపు 1400 మంది బలిదానాలు చేసినట్లు ఉద్యమనేతలు వేసిన అంచనా. కానీ సొంత రాష్ట్రంలో దశాబ్దం తర్వాత కూడా అందులో సగం మందిని కూడా గుర్తించలేని దుస్థితి సమాజాన్ని ఆవేదనకు గురిచేస్తోంది.

జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ సార్
తెలంగాణ సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన వారిలో ప్రొఫెసర్ జయశంకర్​ది కీలక స్థానం.  తొలిదశ నుంచి మలిదశ వరకు పోరాటాల వారధిగా నిలిచారు. పార్టీలు, నాయకులు ఎట్లున్నా తెలంగాణ ఆకాంక్షలను బతికించడమే లక్ష్యంగా పనిచేశారు. తెలంగాణ ఎందుకు అవసరమో సమాజానికి లెక్కలతో వివరిస్తూ ఉద్యమానికి బలమైన పునాది నిర్మించి జాతిపితగా జనం జేజేలు అందుకున్నారు. సొంత కుటుంబం లేకుండా ఉద్యమమే శ్వాసగా జీవించిన ఆయన రాష్ట్ర ఏర్పాటుకు ముందే 2011లో కన్నుమూశారు.

  • మార్చి 10, 2011
  • సబ్బండ వర్ణం.. ఉత్తుంగ తరంగం
  • మిలియన్ మార్చ్ కోసం భారీగా తరలివచ్చిన ఉద్యమకారులతో జనసంద్రమైన హుస్సేన్ సాగర్ తీరం

తొలి అమరుడు శంకర్.. గళ మెత్తిన బెల్లి లలిత
1969 ఉద్యమానికి పునాదులు వేసినవారు కార్మిక నాయకుడు కృష్ణ, విద్యార్థి నాయకుడు రవీంద్రనాథ్, తొలి అమరుడు శంకర్. వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ అనంతుల మదన్ మోహన్, చెన్నారెడ్డి, కాకా వెంకటస్వామి, టీఎన్ సదాలక్ష్మి, ఈశ్వరీబాయి, అనేకమంది విద్యార్థి నేతలు కీలకంగా పనిచేశారు. 1990ల్లో మారోజు వీరన్న, బెల్లి లలిత తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపిస్తూ ప్రాణాలు కోల్పోయారు. భూపతి కృష్ణమూర్తి లాంటివారు మలిదశ ఉద్యమం దిశగా ఆకాంక్షను నడిపించారు. 

ఉపన్యాసాలతో ఉప్పందించిన బియ్యాల 
తెలంగాణ ప్రజల కష్టాలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వల్లే పరిష్కారం అవుతుందని అనేక వేదికల ద్వారా ఉపన్యాసాలు ఇచ్చిన వక్త డాక్టర్ బియ్యాల జనార్ధన్ రావు.  పౌరహక్కుల ఉద్యమంలో సైతం ఆయన పాల్గొన్నాడు. 1993 ప్రాంతంలో ఆదివాసీ ఉద్యమాలు, ఏజెన్సీ ప్రాంత సమస్యలపై అనేక వ్యాసాలు రాశాడు. 1999లో కన్నబిరాన్, ఎస్.ఆర్.శంకరన్ తదితరులతో కలిసి నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలనే ఎజెండాను తీసుకొచ్చారు. మలిదశ తెలంగాణ ఉద్య మంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాల్ని, వివక్షపై ఆయన అనేక వేదికలపై గళమెత్తాడు.

కొండా లక్ష్మణ్​బాపూజీ సొంతిల్లే వేదిక
తెలంగాణ కోసం పదవిని త్యాగం చేసిన తొలితరం నాయకుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రముఖులు. 1969 ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు అండగా నిలిచారు. అన్ని అర్హతలు, అవకాశాలు ఉన్నా ఆయన ఆనాటి నుంచి కన్నుమూసేవరకు ఏ పదవీ తీసుకోలేదు. రాష్ట్రం కావాలన్న ఆశయాన్ని మాత్రం బతికిస్తూ వచ్చారు. కేసీఆర్ సొంత పార్టీ పెట్టడానికి తన సొంత ఇల్లు జలదృశ్యాన్ని వేదికగా ఇచ్చారు. ఆయన త్యాగానికి తగిన గౌరవం దక్కలేదన్న ఆవేదన ఇప్పటికీ ఉద్యమకారుల్లో ఉంది. 

టైగర్ నరేంద్రకు అవమానం 
బీజేపీ నుంచి బయటికొచ్చి తెలంగాణ సాధన సమితి స్థాపించారు మెదక్ మాజీ ఎంపీ దివంగత ఆలె నరేంద్ర.  ఉద్యమ ఆకాంక్ష బలంగా ఉండాలని భావించి తన పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. టీఆర్ఎస్ ను బలోపేతం చేయడంతో  కీలకపాత్ర పోషించిన ఆయనపై కొన్ని ఆరోపణలు వచ్చాయంటూ పార్టీ నుంచి బహిష్కరించారు. టైగర్ గా పేరున్న నరేంద్ర చివరికి అవమానకరంగా బయటికి వచ్చారు. 2014 ఏప్రిల్ లో ఆయన కన్నుమూశారు.

కీలక నేత గాదె ఇన్నయ్య
టీఆర్ఎస్ స్థాపనకు ముందే తెలంగాణ ఆకాంక్షను ప్రచారం చేసినవారిలో కీలకనేత గాదె ఇన్నయ్య. మొదట్లో టీఆర్ఎస్ నిర్మాణంలో కీలకంగా పనిచేసిన ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తర్వాత కాలంలో కేసీఆర్ తో విభేదాలతో దూరమయ్యారు. దశాబ్దకాలం తర్వాత చూస్తే ఒకరకంగా ఉద్యమంలో ఆయన పాత్ర చాలామందికి తెలియని పరిస్థితి. 

ఉద్యమ కెరటం విజయశాంతి
తల్లి తెలంగాణ పార్టీ వేదికగా పోరాడుతున్న విజయశాంతి కూడా ఉద్యమం బలంగా ఉండాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ లో విలీనం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. బలంగా గళం వినిపిస్తూ వచ్చారు. లోక్ సభలో తెలంగాణ ఏర్పాటు బిల్లు పాసైన చరిత్రాత్మక సందర్భంలో సభలో ఓటేసిన టీఆర్ఎస్ ఎంపీ ఆమె ఒక్కరే. ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీకి అవసరమైన ప్రతిసారీ సొంత పైసలు పెట్టిన ఆమె చివరికి అవమానకరంగానే పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. సొంత రాష్ట్రంలో దశాబ్దం తర్వాత ప్రభుత్వం మారాకే ఆమెకు ఎమ్మెల్సీగా గౌరవం దక్కింది.

మిలియన్ మార్చ్ ను నడిపిన కోదండరాం
ప్రొఫెసర్ జయశంకర్ సార్ బాటలో ఉద్యమానికి పెద్ద దిక్కుగా మారారు ప్రొఫెసర్ కోదండరాం.  2009లో మలిదశ ఉద్యమం కీలక సందర్భంలో తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌గా విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా అందరినీ ఒకతాటిపైకి తెచ్చి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. 

రాష్ట్రం వచ్చాక ఆకాంక్షల గురించి మాట్లాడిన ఆయనకు అవమానాలే ఎదురయ్యాయి. ఆయన ఇంటి తలుపులు బద్దలుకొట్టి అరెస్టు చేయించిన సంఘటన సమాజాన్ని కదిలించింది. రాష్ట్రం వచ్చిన దశాబ్దం తర్వాత ప్రభుత్వం మారాక ఆయన సేవలకు ఎమ్మెల్సీ గౌరవం దక్కింది.

గిరిపుత్రులకు అవమానం
రాములు నాయక్ టీఆర్ఎస్ తొలితరం నాయకుడిగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన 2018లో పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయినా అనర్హతకు గురై అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. మరో గిరిజన నేత రవీంద్ర నాయక్ ఉద్యమంలో పాల్గొని 2004లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 

గిరిజన వర్గాలకు రాజకీయ అవకాశాలపై ప్రశ్నిస్తున్నందుకు ఆయన్ను పార్టీ నుంచి గెంటేశారు. పార్టీ ఆఫీస్ ముందు చినిగిన చొక్కాతో ఆయన కన్నీళ్లు పెట్టిన సంఘటన అందరినీ కదిలించింది. తనకు జరిగిన అవమానంపై ఆయన పార్టీ ఆఫీసు ముందు మన్నెత్తి పోశారు. 

తొలి దశ కెరటం కేశవరావు జాదవ్ 
1952 నాన్‌ మూల్కీ గో బ్యాక్‌ ఉద్యమాన్ని నిర్వహించిన వారిలో ప్రముఖుడైన కేశవరావు 1956 ప్రత్యేక హైదరాబాద్ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడమేకాకుండా, 1975 ఎమర్జెన్సీ సమయంలో 18 నెలలపాటు జైలు జీవితాన్ని అనుభవించారు. 1969 ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు మేధోపరమైన సహకారం అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివిధ వేదికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యమ మేధావుల సేవలను ప్రభుత్వాలు ఏ విధంగా గుర్తించాయన్న చర్చలో ఆయన పేరు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.

కనుమరుగైన ఏ చంద్రశేఖర్, కపిలవాయి
టీడీపీ స్థాపన నాటి నుంచి బలంగా ఎదిగిన చంద్రశేఖర్ ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్ లోకి వచ్చి కేసీఆర్ తో కలిసి పనిచేశారు. ఉద్యమంలో భాగంగానే మంత్రి పదవిని వదులుకొని రాజీనామా చేశారు. తర్వాత కాలంలో పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన క్రియాశీలరాజకీయాల్లో కనిపించడం లేదు.  కేసీఆర్‌కు సన్నిహితంగా పనిచేసిన నాయకుల్లో కపిలవాయి దిలీప్ కుమార్ ఒకరు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత రాజకీయ విభేదాలతో పార్టీకి దూరమయ్యారు. 

దగా పడ్డ దళిత నేత విజయరామారావు
దగాపడ్డ దళిత నేతల్లో విజయరామారావు మరొకరు. టీడీపీలో బలమైన దళిత నేతగా ఎదిగిన ఆయన తెలంగాణ ఉద్యమం కోసమే టీఆర్ఎస్ స్థాపన నాటి నుంచి కేసీఆర్ తో ఉన్నారు. మంత్రి పదవిని వదులుకొని రాజీనామా చేశారు. కీలకమైన సందర్భాల్లో కేసీఆర్ కు అండగా నిలిచారు. ఆయన తెలంగాణ ఏర్పాటు ఖరారు కావడంతోనే టీఆర్ఎస్ పాత్ర ముగిసిందని ప్రకటించి పార్టీ నుంచి బయటికొచ్చారు. 

సిరిసిల్ల పోరు బిడ్డ కేకే..
సిరిసిల్ల కేంద్రంగా టీఆర్ఎస్ ను బలంగా మార్చడంతో పాటు ఉద్యమాన్ని నడిపించారు న్యాయవాది కేకే మహేందర్ రెడ్డి. 2009 ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి ఆయనే పోటీచేస్తారని భావించారు. అయితే ఉద్యమనాయకుడి కన్నా అప్పుడే పార్టీలోకి వచ్చిన కొడుకు కేటీఆర్ నే కేసీఆర్ ఎంపిక చేశారు. కేకే స్వతంత్రంగా పోటీచేసిన ఈ ఎన్నికలో ఇద్దరి మధ్య 171 ఓట్ల తేడాతో కేటీఆర్ గెలిచారు. ఉద్యమం కోసం సొంత పైసలుపెట్టి మరీ పనిచేసిన కేకే సొంత రాష్ట్రంలో పవర్ పాలిటిక్స్ లో రాజకీయంగా ఎదగలేకపోయారు.

ప్రజాయుద్ద నౌకను పక్కన పెట్టారు
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా.. కోట్లాది ప్రాణమా..! అంటూ గళమెత్తిన ప్రజాయుద్ధ నౌక గద్దర్. తెలంగాణ ఉద్యమాన్ని పల్లెపల్లెకు పాటలతో వారధి కట్టారు.  ప్రజలను చైతన్యపరిచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. టీఆర్ఎస్ స్థాపనకు ముందు నుంచే ఉద్యమ వేదికలపై కీలకంగా పనిచేశారు. ఉద్యమకాలంలో అందరివాడిగా ఉన్న గద్దర్ సొంత రాష్ట్రం వచ్చాక అప్పటి సీఎం కేసీఆర్ ఇంటి ముందే అవమానాలకు గురికావడం సమాజాన్ని ఆవేదనకు గురిచేసింది. సొంత రాష్ట్రంలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఆయన సేవలకు గౌరవం దక్కింది. ఆయన పేరుతో కళాకారులకు అవార్డులు ఇస్తున్నారు. 

మాయమైపోయిన అందెశ్రీ
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం అంటూ తెలంగాణ తల్లికి పబ్బతి పట్టిన అందెశ్రీ మాయమైపోయారు. ఆయన రాసిన పాట పదేండ్ల పాటు రాష్ట్ర గీతం కాలేకపోయింది. మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ గళమెత్తిన అందె శ్రీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత అవమానాలకు గురయ్యారు. పదేండ్ల ప్రభుత్వం మారిన తర్వాత జయ జయహే తెలంగాణ పాట రాష్ట్ర గీతమైంది. అందె శ్రీకి  గౌరవం దక్కింది.  

చెరుకు చేదెక్కింది!
ఉద్యమకాలంలో టీఆర్ఎస్ కీలకనేతగా చెరుకు సుధాకర్ ఆయన అరెస్టులు, నిర్బంధాలను ఎదుర్కొన్నారు. అప్పట్లో ఉద్యమాన్ని అణిచేసే ప్రయత్నాల్లో పీడీ చట్టం కింద అరెస్టై ఏడాది పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. పీడీ యాక్టు కేసు ఎదుర్కొన్నమొదటి ఉద్యమకారుడిగా ఆయన చరిత్రకెక్కారు. 

జిట్టానూ పట్టించుకోలే
టీఆర్ఎస్ యువజన విభాగం వ్యవస్థాపక అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన భూమిక పోషించిన వారిలో జిట్టా బాలకృష్ణారెడ్డి ఒకరు.  భువనగిరిలో తెలంగాణ జాతర పేరుతో ఆటపాటలు, సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేస్తూ వచ్చారు. ఉద్యమ కార్యక్రమాల కోసం అవసరమైన ప్రతిసారీ సొంత సొమ్ము భారీగా ఖర్చుపెట్టారు. రాష్ట్ర సాధన కోసం రాజీలేకుండా పనిచేసిన జిట్టా రాజకీయంగా నిలదొక్కుకోలేకపోయారు. ఏ గుర్తింపు లేకుండా కన్నుమూశారు.