రియల్లీ.. వండర్ఫుల్ ఆర్ట్..వెంకట్ ప్రతిభ అభినందనీయం: మంత్రి వివేక్ వెంకటస్వామి

 రియల్లీ.. వండర్ఫుల్ ఆర్ట్..వెంకట్ ప్రతిభ అభినందనీయం: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • ఇండో-జపాన్​ ఆర్ట్​ ఎగ్జిబిషన్​ను తిలకించిన మంత్రి  

మాదాపూర్, వెలుగు : మాదాపూర్ ​చిత్రమయి స్టేట్​ఆర్ట్ ​గ్యాలరీలో కొనసాగుతున్న ఇండో--–జపాన్​ ఆర్ట్​ ఎగ్జిబిషన్​ను మంత్రి వివేక్​ వెంకటస్వామి సందర్శించారు. ప్రముఖ ఆర్టిస్టులు వెంకట్​ గడ్డం, జపాన్​కు చెందిన టకాయమా హిరోకోలు గీసిన పెయింటింగ్స్​ను  తిలకించి అభినందించారు. మంత్రి వివేక్​ వెంకటస్వామి మాట్లాడుతూ కళ ద్వారా సమాజంలోని ప్రజల అభిరుచులను అర్థం చేసుకుంటూ, మహిళల అభివృద్ధి, సమాజంలో వారికి సముచిత స్థానం కల్పించాలనే ఆలోచనలను వ్యక్తపరచడం అభినందనీయమన్నారు. 

భారత్–-జపాన్ సాంస్కృతిక సమ్మేళనానికి ఈ ఎగ్జిబిషన్ ఒక వేదికగా నిలుస్తోందన్నారు. హైదరాబాద్, జపాన్‌‌‌‌లోని మియోషి సిటీ మధ్య స్నేహపూర్వక అనుబంధానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఇరు దేశాల కళా సంప్రదాయాలు, సృజనాత్మకతను ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనను నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు కళాకారులను సత్కరించారు.  కార్యక్రమంలో డా. బీఆర్ ​అంబేద్కర్​ విద్యాసంస్థల కరస్పాండెంట్​ సరోజా వివేక్​ కూడా పాల్గొన్నారు.  

ఆకట్టుకుంటున్న కళాకృతులు

వెంకట్ గడ్డం తన కళా ప్రయాణంలో చిత్రకళ, వస్త్రాలపై సృజనాత్మక ప్రయోగాలు, కవిత్వం వంటి డిఫరెంట్​ ఆర్ట్​ ద్వారా తన ఆలోచనలను వ్యక్తపరుస్తున్నారు. ఆర్ట్​ గ్యాలరీలో కొలువుదీరిన ఈ కళాఖండాలు వీక్షకులను అబ్బురపరుస్తున్నాయి. 

పెయింటింగ్స్​తో పాటు వెంకట్ ​రూపొందించిన వినూత్న దుస్తులు ఫ్యాషన్ డిజైనింగ్ ​స్టూడెంట్స్​ను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఎగ్జిబిషన్ గురువారంతో ముగియనున్న నేపథ్యంలో బుధవారం వందల సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు.