- 540 రోజుల వర్క్ పర్మిట్ గ్రేస్ పీరియడ్ శాశ్వతంగా రద్దు
- హెచ్1బీతోపాటు హెచ్4 వీసాదారులపై ప్రభావం
వాషింగ్టన్: అమెరికాలో హెచ్1బీ వీసాపై ఉంటున్న ఉద్యోగులకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సర్కారు మరో షాక్ ఇచ్చింది. అక్టోబర్ 30, 2025న లేదా ఆ తర్వాత వచ్చిన రెన్యువల్ దరఖాస్తులకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఆటోమేటిక్ పొడిగింపు(గ్రేస్ పీరియడ్)ను రద్దు చేస్తున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) మంగళవారం ప్రకటించింది.
ఇప్పటివరకూ వర్క్ ఆథరైజేషన్ గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ దరఖాస్తుల పరిశీలన జరిగే సమయంలో ఇమిగ్రెంట్లు ఉద్యోగాల్లో కొనసాగేందుకు ఆటోమేటిక్గా అనుమతిని పొడిగించేవారు. కానీ, తాజాగా ఈ పొడిగింపును శాశ్వతంగా రద్దు చేశారు. ‘బ్లూమ్బర్గ్ లా’ కథనం ప్రకారం.. అర్హులైన ఇమిగ్రెంట్లు తమ పర్మిట్ రెన్యువల్ దరఖాస్తుల పరిశీలన జరిగే సమయంలో దేశంలో ఉద్యోగాలను కొనసాగించడానికి అనుమతించిన 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపు గడువును తాజా రెగ్యులేషన్ శాశ్వతంగా రద్దు చేస్తోంది.
మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ పొడిగింపును గత ఏడాది డీహెచ్ఎస్ తాత్కాలిక ప్రాతిపదికన సస్పెండ్ చేసింది. తాజాగా శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్)లో ప్రాసెసింగ్ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఇమిగ్రెంట్ ఉద్యోగులకు రక్షణ కల్పించడానికి బైడెన్ హయాంలో ఈ గ్రేస్ పీరియడ్ ఏర్పాటయింది.
అయితే ట్రంప్ హయాంలో ఇమిగ్రెంట్లు తమ వర్క్ పర్మిట్లను నిలబెట్టుకోవడం లేదా పొడిగించుకోవడాన్ని కష్టతరం చేసేలా యూఎస్సీఐఎస్ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. తాజా నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 30, 2025 నుంచి అమల్లోకి వచ్చేలా.. ఆ తేదీన లేదా ఆ తర్వాత సమర్పించిన రెన్యువల్ దరఖాస్తులకు ఆటోమేటిక్ పొడిగింపులను ఈ అప్డేటెడ్ పాలసీ తొలగిస్తుంది. దరఖాస్తుదారులు తమ ప్రస్తుత డాక్యుమెంట్ల గడువు ముగిసిన తర్వాత కూడా పని కొనసాగించాలంటే, తమ పునరుద్ధరించిన ఉపాధి అనుమతి ఆమోదం పొందే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.
హెచ్1బీ, హెచ్-4 వీసాదారులపై ప్రభావం
అమెరికాలో చట్టబద్ధంగా పని చేయడానికి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ల(ఈఏడీ)పై ఆధారపడే విదేశీయులపై ఈ కొత్త రూల్ ప్రభావం పడనుంది. ఇమిగ్రేషన్ హోదా సర్దుబాటును కోరుకునే అభ్యర్థులు, అర్హత కలిగి ఆశ్రయం కోరే వారు, హెచ్-4 వీసా లబ్ధిదారులు దీని పరిధిలోకి వస్తారు.
యూఎస్సీఐఎస్ వారి రెన్యువల్ అభ్యర్థనలను ప్రాసెస్ చేయడానికి ముందే ప్రస్తుత వర్క్పర్మిట్ల గడువు ముగిస్తే భారతీయ నిపుణులు, వారిపై ఆధారపడిన వారికి ఇబ్బందులు తప్పవు. కాగా, దరఖాస్తుదారులు తమ ఈఏడీ రెన్యువల్ దరఖాస్తులను వీలైనంత త్వరగా, ప్రస్తుత డాక్యుమెంట్ల గడువు ముగియడానికి 180 రోజుల ముందుగానే సమర్పించాలని యూఎస్సీఐఎస్ సూచించింది.
