కండీషన్ లేని బస్సులతో వరంగల్ ప్రయాణికుల ఇబ్బందులు

కండీషన్ లేని బస్సులతో వరంగల్ ప్రయాణికుల ఇబ్బందులు

వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీకి 9 డిపోలున్నాయి. ఆ డిపోల పరిధిలో 990 బస్సులు తిరుగుతాయి. వాటిలో 368 అద్దెవి కాగా.. మిగిలిన 622 ఆర్టీసీ సంస్థకు చెందిన స్వంత బస్సులు. వీటిలో ఇప్పటికే 101 వరకూ కాలం చెల్లినవిగా గుర్తించారు. పూర్తిగా కండీషన్ తప్పిన కొన్ని బస్సులను పక్కకు పెట్టినా.. చాలా బస్సులను  నడుపుతూనే ఉన్నారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి.. ఆదాయం కోసం ఈ బస్సు సర్వీసులు రన్ చేయక తప్పటంలేదు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అద్దెబస్సులకు ఆర్టీసీ బకాయిలు చెల్లించకపోవటంతో.. అవి ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో ఉన్న బస్సులను జనం అవసరాలకోసం రన్ చేయక తప్పటంలేదు. 

వరంగల్ ఆర్టీసీ బస్సుల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన వరుస ఘటనలతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. యాదాద్రి జిల్లా కాటేపల్లి దగ్గర.. వరంగల్ రీజియన్ పరిధిలోని తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి. స్టేషన్ ఘన్ పూర్ లో వరంగల్ డిపో 1కు చెందిన సూపర్ లగ్జరీ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. రెండు ఘటనల్లో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. ఆర్టీసీ అధికారులు కాలంచెల్లిన బస్సులను నడుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. 

ఎక్స్ ప్రెస్ నుంచి ఆ పైస్థాయి బస్సులు 6లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత.. వాటిని పల్లెవెలుగుకు మారుస్తారు. పల్లె వెలుగు బస్సులు 13 నుంచి 14 లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత వాటిని స్క్రాప్ గా మారుస్తారు. ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ దగ్గర దగ్ధమైన సూపర్ లగ్జరీ బస్సును.. అప్పటికే పల్లె వెలుగుకు మార్చాల్సి ఉన్నా.. ఎక్స్ ప్రెస్ గా నడిపించారని తెలిసింది. ఆర్టీసీ బస్సులను సాధారంగా నాలుగు స్థాయిల్లో చెకప్ చేస్తారు. ఆర్టీసీ బస్సులకు దాదాపుగా ప్రివెంటివ్ చెకప్స్ ఉంటాయి. బస్సులు రిపేర్ కు రాకముందే సరిచేసే విధానాన్నే ప్రివెంటివ్ చెకప్స్ అంటారు. క్లచ్, బ్రేక్, ఆయిలింగ్ చెక్ రోజూ జరిగే ప్రక్రియ. గ్రీజింగ్, లూబ్రికేటింగ్ వారానికి ఒకసారి చేస్తారు. ప్రతి బస్సు 15వేల కిలోమీటర్లు తిరిగిన ప్రత్యేకంగా చెకప్ చేస్తారు. ఇంజన్ ను పూర్తిస్థాయిలో చెకప్ చేసి.. లోపాలు సరిచేస్తారు. పాడైన పార్టుల స్థానంలో కొత్తవి అమరుస్తారు. ఈ పనులన్నీ డిపోల్లో రోజూ జరుగుతాయి. ఇందుకోసం వరంగల్ పరిధిలోని 9 డిపోలలో మెకానిక్ లు, సహాయకులు కలిసి 450 మంది వరకూ ఉండాలి. కానీ మెకానిక్ లు 187 మంది ఉండగా.. సహాయకులు ఎవరూ లేరు. కొన్నిబస్సులకు అద్దాలు పలిగి ఉన్నా అలాగే డ్రైవ్ చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ఇలాంటి బస్సులనే నడపాల్సి వస్తోందని, ఇబ్బందులు ఉన్నా ప్రయాణికులను సురక్షితంగా తీసుకెళ్లేందుకు జాగ్రత్తలు పాటిస్తున్నామని డ్రైవర్లు చెబుతున్నారు. కొత్త బస్సులు లేకపోవటంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. 

వరంగల్ రీజియన్ లో కరోనాకు ముందు ప్రతిరోజూ 10 లక్షల మంది ప్రయాణికులను ఆర్టీసీ గమ్యస్థానాలకు చేర్చేది. లాక్ డౌన్ తర్వాత స్వంత వాహనాలు పెరగటంతో ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గింది. కరోనా తగ్గటంతో ఇప్పుడిప్పుడే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. కండీషన్ ఎలా ఉన్నా తమలాంటి పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్టీసీ బస్సులో వెళ్లకతప్పని పరిస్థితి ఉందంటున్నారు ప్రయాణికులు. 

ఆర్టీసీ అధికారులు మాత్రం బస్సులు ప్రమాదాలకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. మెకానిక్ లు బస్సుల కండీషన్ ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తారని, మరమత్తులు చేసి, కండీషన్ ఉన్న బస్సులనే డిపో నుంచి బయటకు పంపిస్తామని అంటున్నారు. అద్దె బస్సులపై ఇప్పటివరకూ తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేవని, కొత్త బస్సులు లేకపోవటంతో ఉన్న వాటితోనే నెట్టుకొస్తున్నామని అంటున్నారు.