వెడ్డింగ్ లోన్లకు పెరుగుతున్న డిమాండ్

వెడ్డింగ్ లోన్లకు పెరుగుతున్న డిమాండ్

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌, వెలుగు: చదువు పూర్తికాక ముందే తన పెళ్లి ఎలా జరగాలో ప్లాన్స్ వేసుకున్నాడు కళ్యాణ్ కృష్ణ. సిమ్లాలో, హిమాలయా కొండల మధ్య వింటర్‌‌‌‌లో తన పెళ్లి జరగాలనుకున్నాడు. లగ్జరీ డ్రెస్‌‌లు, నోరూరించే ఫుడ్, ఫ్యామిలీ మధ్య జరిగే పెళ్లి..  తన జీవితంలో ఒక తీయని మెమరీగా నిలిచిపోవాలని కలలు కన్నాడు. ఇప్పుడు తనకు నిశ్చితార్దం జరిగింది. పెరిగిన ఇన్‌‌ఫ్లేషన్‌‌తో  ఖర్చులు బాగా పెరిగిపోయాయి. కరోనా దెబ్బకు ఎందుకంత ఖర్చు చేయడమని సలహాలు కూడా వింటున్నాడు. కానీ,  తను అనుకున్నట్టుగానే పెళ్లి  చేసుకుంటానని, అందుకోసం వెడ్డింగ్‌‌ లోన్‌‌ అయినా తీసుకుంటానని  కళ్యాణ్ కృష్ణ చెబుతున్నాడు. కేవలం తనే కాదు 20–40 ఏళ్ల మధ్యలో ఉన్న యువత (మిలియనీల్స్‌‌)  ఖర్చు చేయడానికి వెనకడుగు వేయడం లేదు.  అప్పు చేయడానికి భయపడడం లేదు. ఇక్కడే ఫైనాన్షియల్ సంస్థలు ముందుకొస్తున్నాయి.  వెడ్డింగ్ లోన్లను ఆఫర్ చేస్తున్నాయి. రాయల్‌‌ ఆర్చిడ్ హోటల్స్ వంటివి ‘ముందు పెళ్లి చేసుకోండి..తర్వాత చెల్లించండి’ వంటి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి కూడా. 

పెళ్లి కోసం అప్పు కొత్తేమి కాదు..

పెళ్లిళ్ల కోసం లోన్లను తీసుకోవడం కొత్త విషయమేమి కాదు. మన తాతా ముత్తాతలు కూడా పెళ్లిళ్లు చేయడానికి, చేసుకోవడానికి అక్కడో ఇక్కడో అప్పులు చేసే ఉంటారు. ఇదే ఫాలో అవుతున్నారు నేటి యువత కూడా. దీన్ని క్యాష్​ చేసుకుంటున్నాయి ఫైనాన్షియల్ కంపెనీలు.  ‘మీ దగ్గర వెడ్డింగ్ లిస్ట్ ఏమైనా ఉందా? పర్ఫెక్ట్‌‌ లొకేషన్‌‌, నోరూరించే ఫుడ్‌‌, మైమరిపించే డెకరేషన్‌‌, మెరిపించే వెడ్డింగ్ డ్రెస్ వంటివి?’ అంటూ ఉండడం హెచ్‌‌డీఎఫ్‌‌సీ వెబ్‌‌సైట్‌‌లో మ్యారేజ్‌‌ లోన్స్ సెక్షన్‌‌లో చూడొచ్చు. ‘ప్రస్తుత పెళ్లిళ్లు ఫ్రిల్స్‌‌(లగ్జరీ డ్రెస్‌‌లు), థ్రిల్స్‌‌తో వస్తున్నాయి... బిల్స్‌‌ను కూడా మరిచిపోకూడదు’ అంటూ టాటా క్యాపిటల్‌‌ వెడ్డింగ్‌‌ లోన్స్‌‌ కోసం ప్రకటిస్తోంది. ‘మీరు కలలు కనే పెళ్లికి  డబ్బు అడ్డుకాకూడదు’ అంటూ బజాజ్‌‌ ఫిన్సర్వ్‌‌  వెడ్డింగ్స్‌‌ కోసం ఇచ్చే పర్సనల్ లోన్స్‌‌ పేజ్‌‌లో పెట్టింది. కంపెనీలు చేస్తున్న మార్కెటింగ్ కూడా బాగా వర్క్ అవుతున్నట్టు కనిపిస్తోంది. వెడ్డింగ్స్‌‌ కోసం లోన్లు తీసుకోవడానికి యువత  వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఇండియాలెండ్స్‌‌ చేసిన సర్వే ప్రకారం, కరోనా సెకెండ్ వేవ్‌‌ టైమ్‌‌లో వెడ్డింగ్స్‌‌ కోసం తీసుకునే లోన్లు, మొత్తం లోన్లలో 33 శాతానికి చేరుకున్నాయి. కిందటేడాది ఫస్ట్‌‌ వేవ్‌‌ టైమ్‌‌లో ఈ లోన్లు 22 శాతంగా ఉన్నాయి. అప్పులివ్వడంలో వెడ్డింగ్‌‌ లోన్స్ సెక్షన్  విస్తరిస్తోందని ఎనలిస్టులు చెబుతున్నారు. వెడ్డింగ్‌‌ లోన్ల కోసం అప్లికేషన్లు పెరిగాయని,  కరోనా సంక్షోభం వలన చాలా అప్లికేషన్లు ఇంకా పూర్తికాలేదని ఈ స్టడీ పేర్కొంటోంది. 

ఇక పర్సనల్ లోన్‌‌‌‌ కాదు వెడ్డింగ్ లోన్‌‌..

ఒకప్పుడు పర్సనల్‌‌ లోన్స్ కేటగిరీ కిందే ఉన్న వెడ్డింగ్‌‌ లోన్స్, ఇప్పుడు ‘మ్యారేజ్‌‌ లోన్స్‌‌’ కింద సపరేట్‌‌గా అందుబాటులో ఉంటున్నాయి. మ్యారేజి లోన్లపై వడ్డీ రేట్లు పర్సనల్ లోన్ల వడ్డీ రేట్లు మాదిరే ఉంటున్నాయని  బ్యాంక్‌‌బజార్‌‌‌‌ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌‌‌‌ పంకజ్ బన్సాల్ పేర్కొన్నారు.  టెనార్‌‌‌‌ కూడా 12–60 నెలల మధ్య కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. పీర్‌‌‌‌ టూ పీర్ (పీ2పీ) లెండింగ్ సైట్లలో కూడా వెడ్డింగ్‌‌ లోన్స్‌‌ పాపులర్ అవుతున్నాయి. పీ2పీ లెండింగ్ అంటే సంస్థల నుంచి కాకుండా వ్యక్తుల నుంచే  డబ్బులు అప్పు తీసుకోచ్చు. కొన్ని సైట్‌‌లు బారోవర్లను, ఇన్వెస్టర్లను కలుపుతాయి. కరోనా ఫస్ట్‌‌వేవ్ టైమ్‌‌లో వెడ్డింగ్ లోన్స్‌‌కు డిమాండ్ తగ్గిందని, సెకెండ్‌‌వేవ్ టైమ్‌‌లో కొంత టైమ్‌‌ వరకు తగ్గిందని పీ2పీ లెండర్ లెన్‌‌డెన్‌‌క్లబ్‌‌ సీఈఓ భవిన్‌‌ పటేల్‌‌ అన్నారు. ప్రస్తుతం బిజినెస్‌‌ సాధారణ స్థాయికి చేరుకుందని, ఈ సెగ్మెంట్‌‌కు డిమాండ్ పెరుగుతోందని, రానున్న నెలల్లో మిగిలిన లోన్  సెగ్మెంట్‌‌లను క్రాస్ చేస్తుందని అభిప్రాయపడ్డారు. లోన్లను తీసుకోవడంలో టాప్ మూడు కేటగిరీలలో వెడ్డింగ్ ఉందని పేయూ హెడ్‌‌ దీపక్ మెండిరత్త అన్నారు. పెళ్లి కోసం మొత్తం సేవింగ్స్‌‌ను ఖర్చు చేయాలని పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అనుకోవడం లేదని, దీనికి బదులుగా లోన్లను తీసుకుంటున్నారని వెడ్డింగ్‌‌ బ్రిగేడ్‌‌ సీఈఓ సన్నా వోహ్రా పేర్కొన్నారు. 20–40 ఏళ్ల మధ్య ఉన్నవారు లోన్లను తీసుకోవడానికి భయపడడం లేదని కోటక్ మహీంద్రా బ్యాంక్‌‌ ప్రెసిడెంట్‌‌ (కన్జూమర్ అసెట్స్‌‌) అంబుజ్‌‌ చాంద్నా పేర్కొన్నారు. ‘జీవితంలో స్పెషల్ మూమెంట్స్‌‌కు మిలినియల్స్‌‌ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పెళ్లి వంటి సందర్భాలలో వెనకడుగేయడం లేదు’ అని అన్నారు. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు కూడా పెళ్లిళ్లకు తమ ఆశీర్వాదం ఇవ్వడంలో వెనకడుగేయడం లేదు.