జెరెమీకి గ్రాండ్ వెల్కమ్

జెరెమీకి గ్రాండ్ వెల్కమ్

కామన్వెల్త్లో స్వర్ణం సాధించి..స్వదేశానికి తిరిగొచ్చిన వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్ రి నుంగాకు ఘన స్వాగతం లభించింది. స్వస్థలం మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో  అభిమానులు పెద్ద ఎత్తున సాదర స్వాగతం పలికారు. జెరెమీకి స్వాగతం పలికేందుకు ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఐజ్వాల్ ఎయిర్ పోర్టుకు తరలివచ్చారు. స్వాగత కార్యక్రమంలో మిజోరం స్పోర్ట్స్ మినిస్టర్, మిజోరం ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రాబర్ట్ రొమావియా రాయ్ట్ పాల్గొని జెరెమీని అభినందించాడు. 

బుల్లెట్ బైకులతో ర్యాలీ..
ఐజ్వాల్లో అభిమానులు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు.  జెరెమీ లాల్రినుంగా ఓపెన్ టాప్ కారుపై తన చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ ప్రజలకు అభివాదం తెలిపాడు. ఫ్యాన్స్ కేరింతలు కొడుతూ జెరెమీని అభినందించారు.  కారు వెనకాల 200 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైకులతో రైడర్స్ సవారీ నిర్వహించారు. ఐజ్వాల్ లో తనకు లభించిన అపూర్వ స్వాగతానికి జెరెమీ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంతటి స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు చెప్పాడు. తాను మరింత కష్టపడి రాష్ట్రానికి, దేశానికి మరిన్ని అవార్డులు తెస్తానని జెరెమీ పేర్కొన్నాడు. 

కామన్ వెల్త్ గేమ్స్‌లో 67కేజీల విభాగంలో 19ఏళ్ల  జెరెమీ స్నాచ్ ఈవెంట్‌లో 140కిలోల బరువెత్తి కొత్త రికార్డు సృష్టించాడు. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో మొత్తం 160కిలోలు ఎత్తాడు. ఇక మొత్తంగా 300కిలోలు ఎత్తి గోల్డ్ మెడల్ ను దక్కించుకున్నాడు.  67కేజీల విభాగంలో కామన్ వెల్త్ గేమ్స్‌లో ఇది కొత్త రికార్డు. అటు కామన్ వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ పతకం సాధించిన తొలి మిజోరం రాష్ట్ర అథ్లెట్‌గా నిలిచాడు.