మహిళ కిడ్నాప్ కేసు: జైలు నుంచి విడుదలైన రేవణ్ణ

మహిళ కిడ్నాప్ కేసు:  జైలు నుంచి విడుదలైన రేవణ్ణ

బెంగళూరు: మహిళ కిడ్నాప్ చేసిన కేసులో అరెస్టైన మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ కుమారుడు, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణకు జైలు నుంచి విడుదలయ్యారు.  మే 13న రేవణ్ణకు బెంగళూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.  ష్యూరిటీ కింద రూ.5లక్షల బాండ్, ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు.  అయితే, రేవణ్ణ దేశం విడిచి వెళ్లడానికి అనుమతించరాదని, బాధితురాలిని లేదా కేసుకు సంబంధించిన ఇతర వ్యక్తులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించవద్దని కోర్టు ఆదేశించింది. 

బెయిల్ మంజూరు కావడంతో మే14వ తేదీ మంగళవారం రేవణ్ణ, బెంగళూరు శివార్లలోని అనేకల్ పట్టణంలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.  ఆరు రోజుల పాటు జైలు జీవితం గడిపిన అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన  హెచ్‌డి రేవణ్ణకు మద్దతుదారులు నినాదాలతో ఘన స్వాగతం పలికారు. 

హసన్‌లో జరిగిన వరుస లైంగిక వేధింపుల కేసును దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) మే 4న రేవణ్ణను అరెస్టు చేసింది. సిట్ విచారణ అనంతరం రేవణ్ణకు మే 13 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.